సీఈవో రవిప్రకాష్, సీఎఫ్‌వో మూర్తి, డైరక్టర్ క్లిఫర్డ్ ఫెరీరా బోనస్‌ల పేరుతో సంస్థ నిధులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి.. గంటల వ్యవధిలోనే రవిప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. దసరా సెలవులు, కోర్టు సెలవులు అన్నీ చూసుకుని రవిప్రకాష్ కొన్నాళ్లు జైల్లో ఉండేలా… అరెస్ట్ జరిగింది. అలంద మీడియా చేసిన ఫిర్యాదు.. దాని వెనుక ఉన్న వాస్తవాలపై.. అసలు విషయాలు రాజ్యాంగసంస్థల ముందు బయటపెట్టడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు రవిప్రకాష్ జైల్లోనే ఉంటారు.
అందరికీ ఇచ్చినట్లే ఆ ముగ్గురికీ బోనస్..! అది అక్రమం ఎలా..?
టీవీ9లో ప్రతీ ఏడాది … ప్రతి ఉద్యోగికి బోనస్ ఇస్తారు. ఉద్యోగి జీతం ఎంత ఉంటే అంత బోనస్‌ను… “బోనస్ కం ఎక్స్ గ్రేషియా” పేరుతో బ్యాంక్‌లో వేస్తారు. టీవీ9 గ్రూప్ సీఈవోగా.. రవిప్రకాష్ జీతం ఏడాదికి రూ. నాలుగు కోట్లు. దానికి తగ్గట్లుగా ఆయనకు “బోనస్ కం ఎక్స్ గ్రేషియా” వచ్చింది. సంస్థకు ఓ చెల్లింపుల విధానం ఉన్నప్పుడు… ఉద్యోగులకు జీతాలు, బోనస్ ఇవ్వాలన్న విషయంపై ప్రత్యేకంగా బోర్డు సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో.. సీఎఫ్‌వో మూర్తి, మరో డైరక్టర్ క్లిఫర్డ్ ఫెరీరాలకు కూడా.. తమ తమ జీతాలకు తగినట్లుగానే… “బోనస్ కం ఎక్స్ గ్రేషియా” పొందారని… ఇది ఎలా అక్రమంగా నిధులు తరలించడం అవుతుందన్న వాదన… వినిపిస్తోంది. ఇంకో విశేషం ఏమిటంటే.. బోర్డు డైరక్టర్ల అనుమతి లేకుండా వారు.. ముగ్గురు..”బోనస్ కం ఎక్స్ గ్రేషియా” తీసుకున్నారని కేసు పెట్టారు. ఆ “బోనస్ కం ఎక్స్ గ్రేషియా” తీసుకున్న సమయంలో ముగ్గురూ బోర్డులో డైరక్టర్లే. ఇప్పటికీ… క్లిఫర్డ్ ఫెరీరా డైరక్టర్‌గా కొనసాగుతున్నారు.
మిగిలిన డైరక్టర్లు పొందిన రూ. కోట్ల బోనస్ అక్రమం కాదా..?
అలంద మీడియా రవిప్రకాష్, మూర్తి, క్లిఫర్డ్ ఫెరీరాలపైనే కేసు పెట్టింది. వారు ముగ్గుర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. వీరు “బోనస్ కం ఎక్స్ గ్రేషియా” పొందిన సమయంలో.. బోర్డులో ఉన్న ఇతర డైరక్టర్లకూ.. అదే తరహాలో…”బోనస్ కం ఎక్స్ గ్రేషియా” రూపంలో కోట్లు అందాయని టీవీ9వర్గాలు చెబుతున్నాయి. కానీ వారిపై అలంద మీడియా ఫిర్యాదు చేయలేదు. ఈ ముగ్గురు డైరక్టర్లు మాత్రమే అక్రమంగా నిధులు మళ్లించినట్లుగా కేసు పెట్టడం.. ఆశ్చర్యకరమంటున్నారు. నిజంగా “బోనస్ కం ఎక్స్ గ్రేషియా” అక్రమం అయితే డైరక్టర్లందరిపై కేసులు పెట్టాలి. వీరు ముగ్గురిపైనే ఎందుకు అనేది.. విచారణలో బయటపడాల్సిన అంశం.
ఎన్సీఎల్టీలో ఉన్న కేసులోనూ అరెస్టా…?
డైరక్టర్లుగా వారి పేర్లను పాత తేదీలతో నమోదు చేశారన్న ఫిర్యాదు కూడా… ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే వీటిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఇప్పటికే విచారణ జరుపుతోంది. అసలు విషయం తేల్చుకోవాల్సింది అక్కడే. కానీ.. అక్కడ విచారణలో ఉండగనే… ఇక్కడ మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టులు కూడా జరిగాయి. మోసం చేసేవాళ్లు… రూ. నాలుగు కోట్లతో ఎందుకు సరిపెడతారు.. రూ. నాలుగు వందల కోట్లు.. తన ఖాతాకు మళ్లించుకోకపోయేవారు కాదా.. తన జీతానికి సమానంగా రూ. నాలుగు కోట్లు మాత్రమే ఎందుకు తీసుకుంటారన్న సందేహం సహజంగానే వస్తుంది.
జీతం వ్యక్తిగత అకౌంట్లో పడినా ఇక అక్రమ తరలింపుగా కేసు పెట్టేయవచ్చా..?
రవిప్రకాష్‌తో పాటు మరో ఇద్దరు డైరక్టర్లపై పెట్టిన కేసులు… ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు, యాజమాన్యాల్లో అనేక రకాల సందేహాలకు తావిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు.. వారి వ్యక్తిగత అకౌంట్లకు జమ చేస్తారు. ఇప్పుడు పోలీసులు నమోదు చేసిన కేసులతో.. సంస్థ సొమ్మును వ్యక్తిగతంగా వాడుకున్నారని ఎవరిపైనైనా ఫిర్యాదు చేయవచ్చా.. అనే సందేహం ప్రారంభమయింది. జీతాలు, బోనస్‌లు.. తీసుకోవడం కూడా.. నేరంగా చూపించడం వల్ల.. కొత్త సంప్రదాయానికి అలంద మీడియా తెర తీసిందనే వాదన వినిపిస్తోంది.