“మేం హుజూర్ నగర్లో పోటీ చేసి ఉంటే ఉత్తమ్ గెలిచేవారు కాదు..!”
…తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడంతో… టీఆర్ఎస్తో ములాఖత్ అయ్యారని వచ్చిన ఆరోపణలపై… అప్పట్లో కొన్ని టీవీ ఇంటర్యూల్లో జగన్ స్పందించిన వైనం ఇది. అయితే.. ఇప్పుడు.. హూజూర్ నగర్లో మరోసారి ఎన్నిక వచ్చింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పోటీ చేయడం లేదు. అలా అని.. గతంలో జగన్ చెప్పినట్లుగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారా… అనే సందేహం రావొచ్చు.. అందుకే ఈ సారి ఎలాంటి శషబిషలు పెట్టుకోకుండా… టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించేశారు. హూజూర్ నగర్ ఉపఎన్నికల్లో వైసీపీ మద్దతు టీఆర్ఎస్కేనని.. అధికారికంగా ప్రకటించేసుకున్నారు.
నిజానికి హుజూర్ నగర్లో.. వైసీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన గట్టు శ్రీకాంత్ రెడ్డి పాతిక వేల ఓట్లుకపైగా పొందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ చేయడానికి ఉత్సాహపడినా.. వైసీపీ అధినాయకత్వం మాత్రం అంగీకారం తెలుపలేదు. దాంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతోనే ఆ పార్టీ ఓటు బ్యాంక్ చెల్లా చెదురైపోయింది. ఇప్పుడు కూడా పోటీ చేయకపోవడంతో… ఇక పూర్తిగా పార్టీ పని అయిపోయినట్లేనని.. మిగిలి ఉన్న వైసీపీ నేతలు తేల్చేసుకున్నట్లయింది.
అయితే.. వైసీపీ మద్దతు టీఆర్ఎస్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందన్నది కూడా.. ఆసక్తికరమే. వైసీపీకి… అక్కడ గతంలోఓ సామాజికవర్గం పూర్తిగా మద్దతుగా నిలిచింది. వారు.. టీఆర్ఎస్ వైపు వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. పైగా.. అసలు వైసీపీ తెలంగాణలో కార్యకలాపాలనే నిలిపివేసింది. ఇలాంటి సమయంలో.. ఆ పార్టీకి క్యాడర్ అంటూ లేకుండా పోయింది. సానుభూతి పరులు కూడా.. ఇతర పార్టీల్లో సర్దుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో.. టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినా.. ప్రకటించకపోయినా పెద్దగా తేడా ఉండదని అంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ … బరిలో నిలవని.. అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో అడిగీ.. అడగకుండానే వైసీపీ. మా మద్దతు మీకే అని భరోసా ఇచ్చింది. ఎంతైనా ఇప్పటికి ఆప్తమిత్రులు కదా..!