రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలంటూ.. జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు. అయితే.. మోడీ రావడం లేదని.. అంతకు ముందే ఏపీ సీఎంకు స్పష్టమైన సూచనలు అందాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. రైతు భరోసా పథకం గురించి ప్రత్యేకంగా ఓ నివేదికను.. పార్టీ హైకమాండ్ కు అందజేశారు. మూడురోజుల కిందటే ఢిల్లీ వెళ్లిన కన్నా లక్ష్మినారాయణ… కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రైతు భరోసా పథకం ప్రవేశ పెడుతున్నారని.. కానీ… జగన్ సర్కార్ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటోందని.. లెక్కలతో సహా వివరించినట్లుగా తెలుస్తోంది.
రూ. 12,500ను రైతు భరోసా పథకం కింద రైతులకు ఇస్తామని.. జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. ఆ రూ. 12,500లో కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు ఉంటాయని చెప్పారు. కేంద్రం ఇప్పటికే కిసాన్ యోజన అనే పథకాన్ని ప్రవేశ పెట్టి.. రైతులకు మూడు విడతలుగా రూ. ఆరు వేలు ఇస్తోంది. ఎన్నికలకు ముందు నుంచి నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పుడు.. వాటిని తమ రైతు భరోసా పథకానికి అనుసంధానం చేసి.. తామే ఇస్తున్నట్లుగా జగన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేది.. బీజేపీ నేత వాదన. కన్నా లక్ష్మినారాయణ కొద్ది రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాలు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాన్ని పెడుతూ.. వైఎస్ఆర్ పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై.. ఏపీ సర్కార్ స్పందించలేదు.
ఇదే విషయాన్ని కన్నా… బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు.. ఓ నివేదిక ఇచ్చారు. జగన్ సమావేశం కావడానికి ముందే నడ్డా… ఏపీలో రాజకీయ పరిస్థితులు… అక్కడి ప్రభుత్వ పనితీరుపై ఓ నివేదికను.. ప్రధానికి ఇచ్చి వచ్చారు. ఆ నివేదిక కన్నా లక్ష్మినారాయణ ఇచ్చిందే. అయితే..మోడీని ఏపీకి రావొద్దని కన్నా.. ఎక్కడా చెప్పలేదు. రైతు భరోసా పథకం .. గురించి మొత్తం వివరించి.. ఆలోచించి .. అన్నీ వివరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకారం.. మోడీ ఏపీ పర్యటన ఖరారయ్యే అవకాశం లేదంటున్నారు.