ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలిచ్చామని.. ఘనంగా చెప్పుకున్న వైసీపీ… ఇప్పుడు వారికి జీతాలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం రూ. ఐదు వేలు ఇస్తున్నందున.. చాలా మంది వాలంటీర్లు.. విధుల్లో చేరేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో చేరిన వారు కూడా.. నిర్లక్ష్యం చూపిస్తున్నారు. రోజంతా సమయం కేటాయించినా ఇంకా మిగిలి ఉండేలా పనులు కేటాయించడంతో.. వాలంటీర్లు కూడా.. వైసీపీ సానుభూతి పరులైనప్పటికీ లైట్ తీసుకుంటున్నారు. రోజురోజుకు… వాలంటీర్ల సంఖ్య తగ్గిపోతూండటం… ఉన్న వారు కూడా.. సీరియస్‌గా పని చేయకపోతూండటంతో… మధ్యే మార్గంగా.. వారిని సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం… ఓ చిట్కా ఆలోచించింది.
వారికి.. రూ. మూడు వేల చొప్పున జీతం పెంచాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారికి రూ. ఐదు వేలు ఇస్తున్నారు. దాన్ని రూ. ఎనిమిది వేలు చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున దాదాపుగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లను… ఏపీ సర్కార్ నియమించింది. వారందరికీ.. నెలన్నర రోజుల గౌరవ వేతనాన్ని అందించింది. ఒక్కటంటే.. ఒక్క సారి మాత్రమే… ఈ వేతనం ఇచ్చింది. రెండో నెలలో జీతం పెంపు ఆలోచన చేస్తున్నారు. అయితే.. సర్వేలు, వివిధ పథకాల లబ్దిదారుల ఎంపిక ఇతర విషయాల్లో ప్రభుత్వం తమ నివేదికలకే ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రచారంతో… వాలంటీర్లు వసూళ్లు పర్వం ప్రారంభించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వృద్ధాప్య పెన్షన్ల పంపిణీని.. కొంత కమిషన్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది నిజమని తేలడంతో.. కొంత మందిపై అధికారులు వేటు వేశారు. వాలంటీర్లతో వచ్చే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ను.. ఎదుర్కోవడం.. ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. ఆ సవాల్‌ను జీతాల పెంపుతో అధిగమించాలనుకుంటోంది.