“సింపుల్‌గా చేద్దామనుకుంటే.. చిరిగి చేటంతయిందనే..” సినిమా డైలాగ్ కరెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్వయించే పరిస్థితి ఏర్పడింది. అవసరమైనంత విద్యుత్ లేక… ఉత్పత్తికి బొగ్గు లేక తంటాలు పడుతున్న ప్రభుత్వం… వాటిని ఇప్పుడు బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెంట్‌ను ప్రస్తుతం ఎక్సేంజీలలో రూ. పదకొండు రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నట్లుగా… ట్రాన్స్ కో వర్గాలు చెబుతున్నాయి. అవి తాత్కాలిక కొనుగోళ్లే అయినప్పటికీ.. అంత ధర పెట్టడం ఏమిటన్న చర్చ మాత్రం ప్రారంభమయింది. ఇతర చోట్ల నుంచి బొగ్గు సరఫరా పూర్తిగా తగ్గిపోవడంతో.. సింగరేణి నుంచి అధిక బొగ్గు కేటాయించాలని.. ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సింగరేణిని కోరాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా.. తెలంగాణ సీఎంకు కేసీఆర్ లేఖ రాశారు. అయితే.. ముందస్తుగా ఒప్పందాల్లో లేకుండా.. అదనంగా.. బొగ్గు అడుగుతున్నారు కాబట్టి.. 40 శాతం ఎక్కువ ధర చెల్లించాల్సిందేనని సింగరేణి తేల్చి చెప్పింది.
సింగరేణి నుంచి ఏపీ జెన్‌కు ఏటా 88 లక్షల టన్నుల బొగ్గు సరఫరా అవుతుంది. వీటికి టన్నుకు రూ. 2,650 మాత్రమే చెల్లిస్తారు. కానీ అదనంగా బొగ్గు సరఫరా చేయాలంటే.. ఈ ధర రూ. 3,710కి చేరుతుంది. ప్రస్తుతం మరో యాభై లక్షల టన్నుల బొగ్గును.. సింగరేణి సరఫరా చేసే అకాశం ఉంది. ఈ మొత్తానికి అధిక ధర చెల్లించాల్సిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ సిఫార్సు చేసినా ఈ ధర మారదు. నిజానికి మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి జెన్కో కొనుగోలు చేసే బొగ్గు ధర టన్నుకు రూ. 1600 మాత్రమే. అయితే.. అక్కడ కార్మికుల ఆందోళన.. భారీ వర్షాలు.. రైలు ట్రాక్‌లకు మరమ్మతుల కారణంగా… పరిమితంగానే బొగ్గు సరఫరా అవుతోంది. అందుకే సింగరేణి నుంచి కొనుగోలు చేయక తప్పడం లేదు.
ఓ వైపు.. సరిపడా విద్యుత్ అందుబాటులో ఉండటం లేదు. ధర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అవకాశం ఉన్నా.. బొగ్గు అందుబాటులో లేదు. బొగ్గు కావాలంటే.. ఒకటిన్నర రెట్లు అధిక రేటు చెల్లించాల్సి వస్తోంది. ఓ వైపు పవన, సౌర విద్యుత్ కొనుగోలు నిలిపివేశారు. నిజానికి సౌర, పవన విద్యుత్ యూనిట్ రూ. నాలుగు రూపాయలకే అందుబాటులో ఉంది. కానీ అదే రేటు ఎక్కువని చెప్పి.. ప్రభుత్వం కొనుగోళ్లు నిలిపివేసింది. ఇంకా కసిగా… వాటికి సంబంధించి గ్రిడ్‌కు అనుసంధానించే కనెక్షన్లు కూడా పీకేసింది. దాంతో.. ఇప్పుడు… ఎక్సేంజీల నుంచి రూ. పదకొండుకు కొనాల్సి వస్తోంది. హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి కాబట్టి… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాస్త రిలీఫ్ ఉంది. అది కూడా తగ్గిపోతే.. మరింతగా.. కరెంట్ కొనుగోళ్లు చేయాల్సిందే. అది ఎంత రేటు అనేది అప్పటి మార్కెట్‌ను బట్టి ఉంటుంది..!