జనసేన పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. రోజుకొకరు చొప్పున ఆ పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతున్నారు. ప్రాధాన్యత దక్కినప్పటికీ… వారు.. ఇతర పార్టీల వైపు చూస్తూండటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి రావెల కిషోర్, చింతల పార్ధసారధి, ఆకుల సత్యనారాయణలతో పాటు అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు సీనియర్లు గుడ్ బై చెప్పారు. తాజాగా.. గతంలో పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచి.. మొన్నటి ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసిన చింతల వెంకట్రామయ్య కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరిలో అత్యధికులు బీజేపీలో చేరుతున్నారు. కొంత మంది మాత్రం.. వైసీపీ వైపు చూస్తున్నారు.
పార్టీని నిర్వీర్యం చేసే దిశగా… రాజకీయం నడుస్తోందన్న అభిప్రాయం జనసేన పార్టీలో ప్రారంభమయింది. ఓ ప్లాన్ ప్రకారం.. కీలక నేతలందర్నీ లాగేసే ప్రయత్నం చేస్తున్నారని వారంటున్నారు. భారతీయ జనతా పార్టీనే ప్రధానంగా తమ పార్టీపై కన్నేసిందని వారు అనుమానిస్తున్నారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులు, ఓ మాదిరిగా ఓట్లు తెచ్చుకున్న వారు, ప్రజల్లో అంతో ఇంతో ఇమేజ్ ఉన్న వారిని బీజేపీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తోందని నమ్ముతున్నారు. పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందన్న నమ్మకం కలగిస్తూండటంతో.. వారు.. పవన్ కల్యాణ్‌ను విడిచిపెట్టేందుకు వెనుకాడటం లేదంటున్నారు. జనసేనకు దూరం అవుతున్న నేతల్లో.. కొంత మందిని .. అవసరాల మేరకు తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ కూడా ప్రయత్నిస్తోంది. బీజేపీ వైపు వెళ్లే సమయంలో.. ఆఫర్ ఇస్తోంది. దాంతో కొంత మంది వైసీపీ వైపు చూస్తున్నారు.
జనసేన అధినేత రాజకీయం కూడా.. బీజేపీ, వైసీపీలకు కలసి వస్తోంది. ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా రాజకీయం చేస్తానని.. ప్రజల్లో ఉంటానని పవన్ కల్యాణ్ ప్రకటిస్తూ ఉంటారు కానీ… అది ప్రకటనలకే పరిమితమవుతూ వస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ప్రజల్లోకి రాలేదు. పార్టీ పరమైన.. ఒకటి, రెండు.. అంతర్గత సమావేశాలు మాత్రం నిర్వహించారు. కొన్ని కమిటీలు నియమిచారు కానీ… వాటి పని ఏమిటో ఎవరికీ తెలియదు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్… కోటరీలో చిక్కుకుపోయారని అంటున్నారు. పార్టీ నేతలకు ఆయనను కలవడం దుర్లభం అవుతోంది. ఇలాంటి సమయంలో.. యాక్టివ్ పాలిటిక్స్ చేయాలంటే… ఇతర పార్టీల్లో చేరడమే బెటరని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ అయితే… కేంద్రంలో అధికారం ఉందనే పలుకుబడి… అవకాశాలు కూడా ఉంటాయని నమ్ముతున్నారు. దీన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది.