వేధింపుల కారణంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. అతనికి న్యాయం చేయాలని యూనివర్సిటీ విద్యార్ధులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ సమస్య పరిష్కారం కాకముందే మళ్ళీ మోహిత్ చౌహాన్ (27) అనే మరొక పి.హెచ్.డి. విద్యార్ధి రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న తన హాస్టల్ గదిలో ఫ్యానుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను కూడా వేధింపుల భరించలేకనే ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని పి.హెచ్.డి.కి గైడ్ గా ఉండి మార్గదర్శనం చేస్తున్న అతని ప్రొఫెస్సర్ వేధింపుల కారణంగానే మోహిత్ చౌహాన్ ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది.
అతను తమతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మానసిక ఒత్తిడికి గురయినట్లు కనిపించాడని కానీ ఆత్మహత్య చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు ఎటువంటి మాటలు అనలేదని అతని స్నేహితులు చెప్పారు. తమతో కబుర్లు చెపుతూ మధ్యలో తన గదికి వెళ్లిపోయాడని, అతను ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే అతను ఫ్యానుకి ఉరేసుకొని కనపడ్డాడని వారు తెలిపారు. తాము అతనిని చూసేసరికే చనిపోయున్నాడని వారు తెలిపారు.
అతని గది నుండి కొన్ని కాగితాలు, అతనికి సంబంధించిన పుస్తకాలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అతని ఆత్మహత్యకి కారణం తెలుపుతూ సూసైడ్ నాట్ వ్రాశాడా లేదా? అనే విషయం ఇంకా తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా బారీగా పోలీసులను మొహరించారు.
ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. రాజకీయ నాయకులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి తరలివచ్చినట్లుగా అక్కడికి కూడా తండోపతండాలుగా తరలి వస్తే అక్కడ కూడా పరిస్థితులు జటిలంగా మారవచ్చును. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉంది కనుక అక్కడికి కూడా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలు తరలివచ్చే అవకాశం ఉందని భావించవచ్చును.