ఈరోజుల్లో లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు మారుతి. ఆ తరవాత.. క్రమంగా నిర్మాతగా, దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. `మారుతి` టాకీస్ పతాకంపై కొన్ని సినిమాల్ని రూపొందించాడు. ఓ దశలో మారుతి సినిమాలకు డిమాండ్ ఎంతలా పెరిగిపోయిందంటే – పోస్టర్‌పై మారుతి పేరు ఉంటే చాలు అనుకునేవాళ్లంతా. చిన్న నిర్మాతలు సినిమాలు తీసి, పోస్టర్‌పై మారుతి పేరు కోసం లాభాల్లో వాటాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడేవారు. అయితే క్రమంగా ఆ ఇమేజ్ కూడా మారుతికి డామేజ్‌ని తెచ్చిపెట్టేలా మారిపోయింది. బయటి నిర్మాతలు, దర్శకులు తీసిన ఫ్లాపులు సైతం మారుతి ఎకౌంట్లో పడిపోయాయి. దర్శకుడిగా తన ఇమేజ్‌పై అది ప్రభావం చూపించడంతో మారుతి టాకీస్‌పై సినిమా నిర్మాణాల్ని ఆపేశాడు. ఇప్పుడు ఇక చిన్న సినిమాలే తీయకూడదని డిసైడ్ అయ్యాడు.
మారుతి టాకీస్‌పై సినిమాలు తీసే ఉద్దేశం ఉంది కానీ, సోలోగా మాత్రం సినిమాలు తీయడట. మరో నిర్మాణ సంస్థతో భాగస్వామిగా చేరి, పెద్ద సినిమాలే తీయాలని భావిస్తున్నాడు. “చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా పెట్టే ఎఫెక్ట్ ఒకేలా ఉంటుంది. చిన్న సినిమా ఫ్లాప్ అయితే… ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఆ రిస్క్ తీసుకోదలచుకోలేదు. తీస్తే పెద్ద సినిమాలు తీయాలి. అందుకోసం… యూవీ, గీతా ఆర్ట్స్ లాంటి నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు చేస్తాను” అని క్లారిటీగా చెప్పాడు. ప్రస్తుతం `ప్రతిరోజూ పండగే` షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు మారుతి. డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.