టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మద్దతుగా నిలిచారు. టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు.. బోనస్ కం ఎక్స్ గ్రేషియా పేరుతో రూ. నాలుగు కోట్లు అక్రమంగా తీసుకున్నారంటూ.. కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న రవిప్రకాష్‌ను.. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పరామర్శించి.. మద్దతు తెలిపారు. టీవీ9 కొత్త యజమాన్యం మైహోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డిలపై రేవంత్ రెడ్డి చాలా కాలంగా రాజకీయంగా ఆరోపణలు చేస్తూ.. పోరాడుతున్నారు. మైహోం రామేశ్వరరావు విషయంలో రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్‌గా ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక భూ కేటాయింపులను.. మైహోం సంస్థకు చేసిందని… చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో వారు టీవీ9 సంస్థను కొనుగోలు చేయడం… సీఈవోగా ఉన్న రవిప్రకాష్‌పై కేసులు పెట్టారు. ఆ తర్వాత రవిప్రకాష్ కూడా.. వారి వ్యాపార వ్యవహారాలు, అక్రమాలపై వివరాలు బయట పెట్టే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి.. రవిప్రకాష్‌కు మద్దతు పలకడం ఆసక్తి రేపుతోంది.
రవిప్రకాష్ ప్రస్తుతం దక్షిణాదిలో సొంతంగా టీవీ చానళ్లను ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని… ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ చానళ్లను పెట్టే ఆలోచనలో ఉన్నారంటున్నారు. టీవీ9 ప్రస్థానంలో ఆయనతో కలిసి నడిచిన పలువురు.. ఇప్పటికే ఆ సంస్థను వదిలి పెట్టి.. రవిప్రకాష్‌తో నడిచేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే కొత్త యాజమాన్యం.. కొద్ది రోజులుగా.. ఆ చానళ్లలోని సీనియర్లకు బయటకు పంపుతోందని అంటున్నారు.
రవిప్రకాష్‌కు మద్దతుగా నిలవడానికి ఇప్పటి వరకూ ఏ రాజకీయ నేత కూడా ముందుకు రాలేకపోయారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులే దానికి కారణం. మొదటి సారిగా.. రవిప్రకాష్‌కు… ఓ ప్రముఖ రాజకీయ నేత మద్దతుగా నిలబడుతున్నారు. రవిప్రకాష్ కు అన్యాయం జరిగిందని.. ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని.. రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. ఇప్పుడు వీరిద్దరికి ఉమ్మడిగా… రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి శతృవులుగా ఉన్నారు. తర్వాత కూడా వీరు కలసి పని చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.