ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంలో గంటా శ్రీనివాసరావుది కీలకపాత్ర. ఆ విషయం అప్పట్లో పీఆర్పీలో ఉన్న వారందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ కూడా.. అదే పనిగా… గంటాపై.. ఈ ఆరోపణలు చేశారు. పీఆర్పీ.. కాంగ్రెస్‌లో కలవడానికి గంటా లాంటివాళ్లే కారణమని ఆయన చాలా సార్లు ఆవేశపడ్డారు కూడా. ఇప్పుడు అదే గంటా శ్రీనివాసరావు… తాను ఐదేళ్లు మంత్రిగా ఉన్న టీడీపీకి దూరంగా జరిగి.. చిరంజీవితో కలిసి మెలిసి తిరుగుతున్నారు. ఆయనను తీసుకుని బీజేపీలో చేరితే… భవిష్యత్ ఉంటుందన్న కోణంలోనే ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
గంటా ఇక టీడీపీకి లేనట్లే..!?
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. తాను అమెరికా వెళ్తున్నానని తాను రానని.. గంటా .. టీడీపీ నేతలకు తేల్చి చెప్పారు. అంతకు ముందు చాలా రోజుల నుంచి ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ సర్కార్ పై టీడీపీ… పోరాటం చేస్తున్నా.. గంటా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అటు అసెంబ్లీలో కానీ.. ఇటు బయట కానీ.. వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఆయన గళమెత్తేందుకు సిద్ధపడటం లేదు. మరో వైపు మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం.. ఆయన వైసీపీలోకి వస్తారేమోనని అడ్డుకునేందుకు తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.
అనర్హతా భయంతోనే ఇతర పార్టీల్లో చేరిక ఆలస్యం..!
గంటా శ్రీనివాసరావు సన్నిహితులుగా ఉండే ఒకనేత ఇటీవల బీజేపీలో చేరారు. గంటా బీజేపీలో చేరినా లేదా వైసీపీలో చేరినా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వేటుపడే ప్రమాదం ఉంది. అందువల్లే గంటా రాజకీయ కెరీర్ పై డైలామాలో ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న కాలంలో విశాఖపట్నంలో భూ కుంభకోణంపై సిట్ వేయాలని మళ్లీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది గంటాను బ్లాక్ మెయిల్ చేయడానికేనని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు.. వైసీపీకి టార్గెట్ కాకుండా ఉండటానికి.. సైలెంట్‌గా ఉండాలని.. నిర్ణయించుకున్నారు.
చిరంజీవిని తీసుకుని బీజేపీ వైపు పయనిస్తున్నారా..?
చిరజీవి రాజకీయాలపై మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారో లేదో ఎవరికీ తెలియడం లేదు. కానీ ఆయన రాజకీయ నేపధ్యం ఉన్న కథను తన తర్వాత సినిమాకు ఎంచుకున్నారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ ను తమిళిశైను ప్రత్యేకంగా కలిశారు. మరో వైపు గంటా శ్రీనివాసరావు ఆయనతో.. ఎప్పుడూ కనిపిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. చిరంజీవిపై గంటా ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఇదంతా.. సాధారణ వ్యవహారం కాదని… బీజేపీలో చేరేలా.. చిరంజీవిపై.. గంటా మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. బీజేపీకి సీఎం అభ్యర్థిగా చిరంజీవే అవుతారని.. నూరి పోస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గంటా కు ఉన్న స్కిల్స్ ప్రకారం.. చిరంజీవి.. ఇవాళ కాకపోతే.. రేపైనా.. ఆయన చెప్పినట్లుగా.. బీజేపీలో చేరుతారని భావించేవాళ్లు ఎక్కువే. మరేం జరుగుతుందో చూడాలి..!