అధికార పార్టీ తెరాసకు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారనేది ఇప్పటికీ సీపీఐ నేతలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు! ఎప్పుడో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనీ, అందుకే ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇస్తున్నామనే అంటున్నారు. దీంతో సీపీఐ తీరు మీద చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో… ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ ధోరణి ఎలా ఉందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎల్లప్పుడూ కార్మికుల పక్షపాత పార్టీగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడే సీపీఐ వైఖరి ఎలా మారిందంటే… రెండు నాల్కలుగా కనిపిస్తోంది!
కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోమనీ, ఉద్యమిస్తామని హెచ్చరిచారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా నిలుస్తామన్నారు. అరెస్టు చేసిన ఆర్టీసీ నేతల్ని విడుదల చేయాలనీ, గత నెల జీతాలు కూడా వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినంత మాత్రాన ఉద్యోగాలు పోతాయా అని ప్రశ్నించారు. తమిళనాడులో ఇలానే ఉద్యోగాలు తీసేస్తామని నాటి జయలలిత అంటే ఉద్యోగాలు పోయాయా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కక్ష సాధింపు ధోరణిలో మాట్లాడుతున్నారనీ, సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాసకు జై అని… ఇప్పుడు ఆర్టీసీ దగ్గరకి వచ్చేసరికి ముఖ్యమంత్రి వైఖరిని తప్పుబడుతున్నారేంటీ అని చాడాని అడిగితే… రాజకీయం వేరు, పోరాటం వేరు అన్నారు! హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉన్న అవసరాలు వేరు, ఇప్పుడు సమ్మె వేరట! అంటే, రాజకీయ ప్రయోజనాలు వేరు, ప్రజల సమస్యలు వేరు అన్నట్టే కదా! ఇలా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తే… కమ్యూనిష్టులను ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్న ఆలోచన సీపీఐకి ఉంటే, హుజూర్ నగర్ లో మద్దతును ఉపసంహరించుకుంటే తప్పేముంది? ఆ పనిచేస్తే ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ ఒక మెట్టు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు! ఎందుకంటే, హుజూర్ నగర్లో సీపీఐ ఓటు బ్యాంకు అవసరం తెరాసకు చాలా ఉంది. ఇలాంటి వ్యూహంతో వ్యవహరిస్తే ఆర్టీసీ కార్మికులకు మంచి చేసినట్టూ అవుతుంది, తమ సత్తాను చాటుకున్నట్టూ అవుతుంది. కానీ, అలాంటి ఆలోచన వీరికి ఉన్నట్టే లేదు. అందుకే రాజకీయం వేరు, పోరాటం వేరు అంటున్నారు!