సోషల్ మీడియాలో వైసీపీ నేతలు బరి తెగించి .. వ్యాఖ్యలు, విమర్శలు, వ్యక్తిగ దూషణలు చేస్తున్నారంటూ.. చంద్రబాబునాయుడు.. ప్రెస్ మీట్ పెట్టి… వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం కలకలం రేపింది. పోలీసులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా… మహిళలను దూషించినా.. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. మరో వైపు .. టీడీపీ కార్యకర్తలు ఎవరైనా చిన్న విమర్శ చేస్తే మాత్రం పోలీసులు పోలోమంటూ వచ్చి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. బాధితులతో.. వారు ఎదుర్కొన్న అనుభవాలను కూడా మీడియా ముందు వివరించారు. ఇది.. హాట్ టాపిక్ అయింది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సైకోల్లా మారిపోయారని టీడీపీ ఎటాక్ ఉద్ధృతం చేసింది. ఇది ప్రజల్లోకి వెళ్లిపోతుందని అనుకున్నారేమో కానీ.. వైసీపీ నేతలు కూడా తెర ముందుకు వచ్చారు.
సోషల్ మీడియాలో తమపైనే టీడీపీ కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని… నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులపై దారుణమైన పోస్టులు పెడుతున్నారని వారు చెబుతున్నారు. అసభ్య పోస్టులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వారంటున్నారు. టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసీపీ నేతలు సవాల్ చేశారు. సభ్యసమాజం తలదించుకొనేలా పోస్టులు పెట్టారని అంటున్నారు. బాలకృష్ణ ఇంట్లో టీడీపీ సోషల్ మీడియా కార్యాలయం నడుస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. అంతకు ముందు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల పోస్టులపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన డీజీపీ… వారు వచ్చే సమయానికి కార్యాలయంలో లేకుండా వెళ్లిపోయారు. కానీ.. వైసీపీ నేతలు ఇచ్చే ఫిర్యాదును మాత్రం స్వయంగా తీసుకున్నారు.
దీనిపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. డీజీపీ… వైసీపీ కోసమే పని చేస్తున్నట్లుగా ఉన్నారని అంటున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వివక్ష చూపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పేటీఎంలలో డబ్బులు చెల్లించి… అసభ్యకర పోస్టులు పెట్టించి.. సోషల్ మీడియా అంటేనే రోత పుట్టేలా చేసింది వైసీపీ నేతలేనని టీడీపీ నేతలంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న …అరాచకాలు, అకృత్యాలపై బహిరంగ చర్చకు సిద్ధమని.. వైసీపీ నేతల సవాల్‌ను స్వీకరించారు. సమయం స్థలం మీరు చెబుతారా?…మమ్మల్ని చెప్పమంటార అని వర్ల రామయ్య సవాల్ చేశారు. అర్ధం లేని ఆరోపణలు చేయడం..సమాజాన్ని తప్పుదారి పట్టించడంలో వైసీపీ నేతలు పీహెచ్డీ చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ .. మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.