టాలీవుడ్లోనే కాదు, దక్షిణాదినే అగ్ర దర్శకుడిగా చలామణీ అవుతున్నాడు రాజమౌళి. దేశంలోనే అత్యుత్తమ దర్శకుల జాబితా తీస్తే అందులో రాజమౌళి పేరు తప్పకుండా ఉంటుంది. తన సినిమాలతో, విజన్‌తో రాబోయే తరానికి ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు రాజమౌళి. రాజమౌళి సమకాలికులు కూడా.. ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. `రాజమౌళి స్థాయి అందుకోవాలని` ఆశ పడుతున్నారు. అలాంటి దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకడు. `అతనొక్కడే`, `కిక్`, `రేసుగుర్రం`, `ధృవ` లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని తెరకెక్కించిన సూరి.. ఇప్పుడు `సైరా`తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన టార్గెట్ రాజమౌళిని అందుకోవడమే అని చెప్పకనే చెప్పాడు. ”సైరా లాంటి చారిత్రాత్మక సినిమా తీయడం చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ పరుగు ఇక్కడితో ఆగకూడదు. రాజమౌళిని అందుకోవాలని ఆశగా ఉంది” అని చెబుతున్నాడు సురేందర్ రెడ్డి. `సైరా`లో ఒకట్రెండు సన్నివేశాల్లో రాజమౌళి స్ఫూర్తి కనిపిస్తూనే ఉంటుంది. ఎమోషన్ సీన్లు తీసేటప్పుడు, యాక్షన్ సీన్లకు ముందు ఎమోషన్ని సెట్ చేస్తున్నప్పుడు రాజమౌళిని అనుకరించే ప్రయత్నం చేశాడు సురేందర్ రెడ్డి. మరి ఆ స్థాయిని ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.