ప్రభుత్వం గ్యారంటీ ఇస్తానన్నా…. ఏపీ ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుని… వాటిని పథకాలకు వాడుకోవడం… కొన్నాళ్లుగా ప్రభుత్వాలు చేస్తున్న పని. ఏపీ సర్కార్ కూడా.. అదే చేయాలనుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ తమకు రూ. మూడు వేల కోట్లు అప్పు కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు పెట్టుకుంది. వాస్తవంగా అయితే.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థకు ఉన్న ఆస్తులు, అప్పుల పట్టికను బట్టి రూపాయి కూడా అప్పు రాదు. కానీ ప్రభుత్వం తాను హామీగా ఉంటానని ఒప్పుకుంది. సాధారణంగా.. ప్రభుత్వాలు హామీ ఇస్తే.. బ్యాంకులు మరేమీ ఆలోచించకుండా అప్పులిస్తాయి. కానీ ఇప్పుడు ఏపీ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ అయింది. అసలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపైనే సందేహాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ పై.. వివిధ రేటింగ్ సంస్థలు ఇచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏపీ సర్కార్ కు… ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ కు రుణం ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలోనూ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి విధానాలే మైనస్‌గా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం.. గత ప్రభుత్వం అంటూ… గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేశారు జగన్. అంతే కాదు.. గత ప్రభుత్వం చేసిన అప్పులంటూ… పాత బాకీలను తీర్చడానికి కూడా.. నిరాకరిస్తున్నట్లు ఆర్థిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ కు అప్పిస్తే.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు.. అదే జగన్ బాటలో పయనిస్తే .. తమ సంగతేమిటన్న చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో జరుగుతోంది. అందుకే ఏపీసర్కార్ వైపు చూసేందుకు వారు వెనుకడుగు వేస్తున్నారు.
ప్రస్తుతం.. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం… ఏపీ సర్కార్ కు రుణపరిమితి కూడా తగ్గిపోయింది. ఎంత జీడీపీ ఉంటే.. దానికి తగ్గట్లుగా ఓ స్థాయి వరకే రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే.. ఇప్పుడు జీఎస్డీపీ పడిపోయింది. ఆదాయం పడిపోయింది. ఈ కారణంగా.. ఏపీ సర్కార్ కు.. రుణాలు ముట్టడం లేదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుందామంటే.. ప్రభుత్వ విశ్వసనీయత అడ్డం పడుతోంది. మరో వైపు పెద్ద ఎత్తున పథకాలకు.. నిధులు పంపిణీ చేయాల్సిన సమయం దగ్గర పడింది. దీంతో.. ప్రభుత్వం… ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.