ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను చివరికి ఆటోలకు స్టిక్కర్లు అతికించడానికి కూడా ఉపయోగించుకుంటూండటం హాట్ టాపిక్ అవుతోంది. పోలీసులు ఇంతగా ఎందుకు దిగజారుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోలీసులు స్టిక్కర్ డ్యూటీని తీవ్రంగా తప్పు పట్టారు. అయితే … ఆయన పోలీసుల్ని కాకుండా వారిని అలా వాడుకుంటున్న.. ఏపీ సర్కార్ ను తప్పు పట్టారు. చంద్రబాబును గతంలో బీజేపీ స్టికర్ సీఎం పేరుతో సంబోధించేది. ఇప్పుడు అదే విషయాన్ని అన్యాపదేశంగా గుర్తు చేస్తూ.. చంద్రబాబుకు, మీకూ తేడా ఏముందని జగన్ ను కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేశాడని.. మీరు అంతకు మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కన్నా మండిపడ్డారు.
పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలకు … మీ పార్టీ రంగులేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని .. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు … ముఖ్యంగా పంచాయతీ కార్యాలయాలకు.. పార్టీ రంగులు వేయడంపై… ఇప్పటికే బీజేపీ నేతలు.. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్ మంత్రి కూడా.. పంచాయతీ కార్యాలయాలకు.. పార్టీ రంగులు వేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అవేమైనా పార్టీ ఆఫీసులా.. అని ప్రశ్నించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే … కేంద్రం నివేదిక అడిగినట్లు తెలుస్తోంది. త్వరలో మళ్లీ రంగులు వేసిన పంచాయతీ కార్యలయాలకు మళ్లీ… తెల్ల సున్నం వేయక తప్పదని బీజేపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సర్కార్ పై ఎటాక్ చేసే విషయంలో బీజేపీ ఏ మాత్రం.. మొహమాటానికి పోవడం లేదని.. కన్నా విమర్శలతోనే చెబుతున్నారు.