నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన గొడవ ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల వరకూ వెళ్లడంతో.. పరిస్థితిని చక్కదిద్దేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎంపీడీవో దాడి వ్యవహారం, లేఔట్‌కు డబ్బులు వసూళ్లు చేసిన వైనంపై కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో.. ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందని భావించిన జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ క్లాస్ పీకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. వారితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నేతల్ని కూడా పిలిచారు. అంతర్గత రాజకీయాల కారణంగా… ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ.. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీస్తే సహించేది లేదని.. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నట్లుగా తెలుస్తోంది.
నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పలువురుపై దాడులు చేస్తూ… మీడియాకు ఎక్కుతున్నారు. వ్యతిరేక కథనాలు రాస్తున్నారని నేరుగా మీడియాపైనే దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో… తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు డైరక్షన్ కూడా ఇచ్చారు. అయితే.. పోలీసులు ఎంపీడీవో ఇంటిపై దాడి చేసినందుకు పెట్టీ కేసులు పెట్టి… గంటలో బెయిల్ ఇచ్చి పంపించేశారు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జగన్.. ఎమ్మెల్యేలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయనున్నట్లుగా చెబుతున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో … అప్పటి సీఎం .. తమ పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయకపోవడం వల్లనే.. వారిపై.. వారి వారి నియోజవకర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. ఇప్పుడు… 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. వారిపై అజమాయిషీ పార్టీ నాయకత్వానికి కష్టం అవుతోంది. ఈ క్రమంలో… జగనమోహన్ రెడ్డి.. పరిస్థితి మరింత దిగజారకుండా… ఎమ్మెల్యేల్ని కట్టడి చేయాలని అనుకుంటున్నారు.