హైదరాబాద్: హైదరాబాద్‌లోని సీమాంధ్రులను కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిన్న తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మధ్యలో వచ్చినవాళ్ళు హైదరాబాద్ నగరంలో కల్చర్‌ను చెడగొట్టారంటూ పరోక్షంగా సీమాంధ్రులనుద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. రంజాన్ పండగ హైదరాబాద్ నగరంలో ఎంతో ఘనంగా చేసుకుంటారని, దీనికో చరిత్ర, సంస్కృతి ఉందని అన్నారు. మధ్యలో వచ్చినవారు ఈ కల్చర్‌ను చెడగొట్టారని విమర్శించారు. ఈద్ ముబారక్ అనమంటే ఊద్ ముబారక్ అంటారని ఎద్దేవా చేశారు. పోయిన సంస్కృతిని తిరిగి తీసుకు వచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో మతసామరస్యం వెల్లివిరిసిందని, 750 సంవత్సరాల తర్వాత ఒకసారి కొందరు దగాకోరు, లుచ్ఛాగాళ్ళు హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించారని విమర్శించారు. హైదరాబాద్ మతసామరస్యంపై గాంధీజీసైతం, మీ నిజాం ఎంతో గొప్పవాడు అని పొగిడినట్లు కేసీఆర్ తెలిపారు.