మెగా కాంపౌండ్ దృష్టి… మలయాళ చిత్రం `లూసీఫర్`పై పడింది. మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రమది. ఓ కీలకపాత్రలో ఫృథ్వీ రాజ్ నటించారు. ఈ సినిమాని రీమేక్ చేస్తున్నామని ఇది వరకే చిరంజీవి ప్రకటించారు. మోహన్‌లాల్ పాత్రలో చిరు, ఫృథ్వీరాజ్ గా చరణ్ నటించబోతున్నారు. తండ్రీ కొడుకుల్ని ఒకే ఫ్రేమ్‌లో చూడడం మెగా అభిమానులకు పండగే. లూసీఫర్ మలయాళంలో బాగా ఆడింది. మంచి డబ్బులొచ్చాయి కూడా.
కాకపోతే.. ఇది తెలుగు నేటివిటీకి పనికొస్తుందా, లేదా? అనేదే పెద్ద డౌటు. గాడ్ ఫాదర్లాంటి కథ ఇది. తెలుగు సినిమాకి కావల్సిన హంగులు చాలా తక్కువగా కనిపిస్తాయి. మోహన్ లాల్ పాత్ర స్టైలీష్‌గా ఉంటుంది గానీ, డైలాగులు తక్కువ. ఫృథ్వీరాజ్ పాత్ర కూడా సినిమా చివర్లో వస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే అతిథి పాత్ర. కథలో క్రీస్టియన్ వ్యవహారాలు చాలా ఎక్కువ. సినిమా స్లో పేజ్‌లో నడుస్తుంటుంది. ఓ తండ్రి కూతుర్ని శారీరకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటాడు. ఇవన్నీ.. తెలుగు ప్రేక్షకులకు మింగుడు పడని వ్యవహారాలు. అన్నట్టు ఈ సినిమా తెలుగులో అదే పేరుతో డబ్ అయ్యింది. కానీ ఒకట్రెండు రోజులకు మించి ఆడలేదు. ఇదే కథని తెలుగులోకి తీసుకురావాలంటే చాలా మార్పులు చేయాలి. అలా చేస్తే… కథలో ఫీల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మోహన్ లాల్ పాత్రకు చిరు నూటికి నూరుపాళ్లు సరిపోతాడు. కాకపోతే.. చిరంజీవి సినిమా నుంచి ఆశించే అంశాలు ఇందులో కనిపించవు. అయినా సరే, చిరు ఈ సినిమా రీమేక్ చేయాలని అనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాకపోతే… ప్రస్తుతం చిరు కొరటాల శివ సినిమా పూర్తి చేయాలి. ఆ తరవాత త్రివిక్రమ్ సినిమా ఉంది. ఇవి పూర్తవ్వాలి. ఆ తరవాతే లూసీఫర్ మొదలవ్వాలి. ఈలోగా ఏమైనా జరగొచ్చు.