సర్వేపల్లి, నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య గొడవను వైసీపీ అగ్రనాయకత్వం సర్దుబాటు చేసింది. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు వేలు పెట్టవద్దని.. ఇద్దరి సూచించింది. ఓ ఎంపీడీవో ఇంటిపై కోటంరెడ్డి దాడి చేయడంతో…రాజకీయ కలకలం రేగింది. పరస్పర ఆరోపణలతో ఇది వసూళ్లకు సంబంధించిన అంశమని ప్రచారం జరగడంతో… వైసీపీ పెద్దలు వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు. నేతలందర్నీ అమరావతి పిలిపించారు. వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో… పంచాయతీ చేశారు. వైసీపీ నెల్లూరు జిల్లా నేతలంతా హాజరయ్యారు. పార్టీని ప్రజల్లో చులకన చేయవద్దని వైవీ సుబ్బారెడ్డి గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. కోటంరెడ్డి వరుసగా వివాదాల్లోకి వస్తూండటంతో.. ఆయనను కొన్నాళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉండమని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. తర్వాత మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి కూడా అదే చెప్పారు. నెలలో ఇరవై ఐదు రోజులు అమరావతిలో ఉంటానన్నారు.
భేటీ తర్వాత… తాము అభివృధ్ది గురించి మాత్రమే చర్చించామని వైసీపీ నేతలు మీడియాకు చెప్పుకొచ్చారు. రైతు భరోసా, సీఎం కార్యక్రమంపై మాత్రమే చర్చించామని కోటంరెడ్డి తేల్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి మేనత్త కొడుకని..కొందరు మమ్మల్ని విడగొట్టాలని చూశారని అనుమానం వ్యక్తం చేశారు. నారాయణ, ప్రదీప్‌రెడ్డి అలా చేసి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇకపై నెలకు 25 రోజులు అమరావతిలోనే ఉంటానని కోటంరెడ్డి ప్రకటించారు. కాకాణి గోవర్దన్‌రెడ్డి కూడా మీడియాకు దాదాపుగా అదే చెప్పారు.
మా మధ్య వివాదాలను మేమే పరిష్కరించుకునేంత సాన్నిహిత్యం ఉందిని.. కోటంరెడ్జి తన బావమరిదని చెప్పుకున్నారు. నెల్లూరు వ్యవహారంపై టీడీపీ మండిపడింది. జగన్ నెల్లూరు నేతలను పిలిచి పులివెందుల పంచాయితీ చేస్తున్నారని.. కోటంరెడ్డికి వెంటనే బెయిల్ ఇచ్చి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డి విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే జైల్లో ఉండేవారు, సీఎంకు నైతిక విలువలుంటే శ్రీధర్‌రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని మరో టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.