రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించడంలో జగన్ యాటిట్యూట్ చూపించారని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ప్రధాని మోడీని ఎవరైనా ఏదైనా ప్రోగ్రాంకు పిలవాలనుకుంటే…ఖాళీగా ఉన్న సమయం తెలుసుకుని.. ఆ టైంలోనే ప్రోగ్రాం పెట్టుకుంటారు. ప్రభుత్వాధినేతలు ఎవరైనా… భారీ పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు నాలుగైదు ముహూర్తాలు చూసుకొని ఆయన వద్దకెళ్లి ఇందులో మీకు వీలున్న రోజు ముహూర్తానికి రావాలని సహజంగా ఎవరైనా కోరుతారు. కానీ మేం ముహూర్తం పెట్టాం.. ఆ ముహూర్తానికి మీరు రావాలంటూ ప్రధానమంత్రిని జగన్ కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మోడీని అగౌరవ పరిచేలా జగన్ వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీ నేతలు రామ్ మాధవ్ కు ఫిర్యాదు చేశారు. ప్రధాని తాము పెట్టిన ముహుర్తానికి పిలువగానే వచ్చేస్తారన్నట్లుగా… ముందుగానే తేదీని ఖరారు చేసి ఆ తర్వాత ప్రధానిని ఆ తేదీకి ఆహ్వానించడం ఏమిటని బీజేపీ నేతలు రామ్ మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. రైతు భరోసా కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరు కావడం లేదని బీజేపీ నేతలకు అనధికార సమాచారం అందింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తోన్న రూ. 6 వేల రూపాయలను రైతు భరోసాలో చేర్చినా… కనీసం మాట మాత్రం కూడా కేంద్రం అందించిన సాయం కూడా ఇందులో ఉందని వైసీపీ నేతలు ఎందుకు చెప్పడంలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మోదీని మాట వరుసకు మాత్రమే ఆహ్వానించారని.. ఆయన ఏపీకి రావడం… వైసీపీ నేతలకు ఇష్టం లేదన్న ప్రచారం కూడా బీజేపీ వర్గాల్లో సాగుతోంది. అందుకే అవమానించేలా…ఆహ్వానం పంపారంటున్నారు. ఈ విషయంపై… రానున్న రోజుల్లో రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ తీరుపై.. బీజేపీ నేతలు …హైకమాండ్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మోడీ విషయంలోనే జగన్ యాటిట్యూడ్ చూపించడంతో… మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు.