స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమను అవమానించిందని.. ఏపీ సర్కార్ భావిస్తోంది. అప్పు అడగడమ తప్పన్నట్లుగా.. ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న అభిప్రాయాన్ని కల్పిస్తూ.. లేఖ రాయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే.. అసలు ఎస్బీఐ ఆ లేఖ ఎందుకు రాసిందన్నదానిపై.. ప్రభుత్వంలోనే విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం.. అమరావతిలో… స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకర్లందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రుణాల చెల్లింపు అంశం చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో కొంతమంది అధికారులు, మంత్రులు గత ప్రభుత్వం తీసుకున్న రుణాలతో తమకు సంబంధం లేదని బ్యాంకర్లతో వాదించారు.
తమ హయాంలో తీసుకొన్న రుణాలపై మాత్రమే తాము దృష్టిసారిస్తామని వారికి స్పష్టం చేశారు. మంత్రులు, అధికారుల మాటలను విన్న జగన్ కూడా.. ఖండించలేదు. అదే తన అభిప్రాయం అన్నట్లుగా ఉండిపోయారు. దీంతో సమావేశంలో పాల్గొన్న బ్యాంక్ ఉన్నతాధికారులు విస్మయం చెందారు. ఆ వ్యాఖ్యల వల్లే ప్రస్తుతం ఎస్బీఐ లేఖ వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం ఇచ్చిన కమిట్ మెంట్లను తర్వాత వచ్చే ప్రభుత్వం గౌరవించాల్సిందేనని ఎస్బీఐ లేఖలో చెప్పడానికి..ఇదే కారణమని.. ప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తు చేసుకుంటున్నారు.
ఈ లేఖకు సమాధానం పంపాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ఎస్.బి.ఐ. లేఖ ఉందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అసంతృప్తితో ఉన్నారు. అసలు ఈ లేఖ ఎలా లీక్ అయిందన్నదానిపై దృష్టి పెట్టారు. ఎస్బీఐ వర్గాలే జాతీయ మీడియాకు అందించాయని.. అధికారవర్గాలు ప్రభుత్వానికి చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం… తమ దగ్గర నుంచే లీకయిందనే దిశగా నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది.