అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారిగా విశాఖకి వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఈనెల 10, 11 తేదీల్లో విశాఖలోని ఎన్.టి.ఆర్. భవన్ కేంద్రంగా విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజక వర్గాల సమీక్ష నిర్వహించనున్నారు. గడచిన ఎన్నికల్లో విశాఖ సిటీలో కొంత ఫర్వాలేదు అనిపించుకున్నా, రూరల్ ప్రాంతాల్లో టీడీపీ ఘోర పరాజయమే మూటగట్టుకుంది. దీనికి కారణం అంతర్గత కుమ్ములాటలే అనేది అందరికీ తెలిసిందే. అయితే, చంద్రబాబు నిర్వహించబోయే సమీక్షలో కొన్నాళ్లుగా జిల్లాలో ప్రముఖ నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక కొలీక్కి వస్తాయా..? స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం కోసం జిల్లా నాయకుల మధ్య సయోధ్యను చంద్రబాబు కుదర్చగలరా అనే ప్రశ్నలున్నాయి.
విశాఖ టీడీపీ అనగానే గుర్తొచ్చేది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారమే. ఆయన పార్టీలో ఉంటారా ఉండరా అనే చర్చ కొన్నాళ్లపాటు జరిగినా, చివరికి దానికీ చెక్ పడింది. సీనియర్ నేత సబ్బం హరి పరిస్థితి ఏంటనేది ఈ సమీక్ష సమావేశంలో తేలనుందని అనుకోవచ్చు. ఎందుకంటే, ఎన్నికలయ్యాక ఆయన టీడీపీ తరఫున ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు! ఈ మధ్యనే, మాజీ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెహ్మాన్, ఎమ్మెల్యే గణేష్ ల మధ్య పంచాయితీ తెరమీదికి వచ్చింది. రెహ్మాన్ అధ్యక్షుడిగా ఉండగా తాను పార్టీ కార్యక్రమాలకు రానని గణేష్ పట్టుబట్టుకుని కూర్చున్నారు. పాయకరావు పేటలో అనిత వ్యవహారం కూడా అక్కడ చర్చనీయంగా మారిందని సమాచారం. అనితకీ, ఇన్ ఛార్జ్ బంగారయ్యకీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రూరల్ జిల్లాలో స్థానాలు దక్కించుకోలేకపోవడంతో… కొంతమంది నాయకులు వైకాపాలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ మధ్య కథనాలు వినిపిస్తున్నాయి. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు త్వరలో అధికార పార్టీలోకి వెళ్లబోతున్నారనే చర్చ ఉంది. అరుకు, పాడేరు లాంటి ప్రాంతాల్లో నాయకుల్ని మార్చాలనే డిమాండ్ కూడా ఉంది.
ఇలా విశాఖపట్నంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా టీడీపీకి సమస్యగానే కనిపిస్తోంది. అన్నీ చక్కదిద్దాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు జరిగే సమీక్ష సమావేశాలపై ఆసక్తి నెలకొంది. ఇంతకీ… ఈ సమీక్షకు జిల్లాకు చెందిన నాయకుల్లో ఎంతమంది హాజరైతారు అనేది కూడా చూడాలి. ఈ సమీక్ష సమావేశంలో గంటా శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే… పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారనేదీ చర్చనీయం అవుతుంది. మొత్తానికి, విశాఖ టీడీపీలో చక్కదిద్దాల్సినవి చంద్రబాబు ముందు చాలానే ఉన్నాయి.