ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ప్రభుత్వం మరో పదవి ఇచ్చింది. ఆయన హిందీ భాషలోనూ పండితుడు కావడంతో.. ఆయనకు ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడెమీ చైర్మన్‌గా మరో పదవి ఇప్పగించారు. యార్లగడ్డ ఇక నుంచి అటు తెలుగు అధికార భాష.. ఇటు హిందీ అకాడెమీ చైర్మన్‌గా.. రెండు పదవులనూ నిర్వహిస్తారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. సాహిత్య రంగంలో చాలా కృషి చేశారు. ఆయనకు తెలుగుతో పాటు.. హిందీలోనూ.. పండితుడే. తెలుగుకు ఎలా.. అధికార భాషా సంఘానికి అధ్యక్షుడయ్యే అర్హత ఉందో.. హిందీలోనూ అలాంటి పీఠాలను అధిరోహించగల సామర్థ్యం ఉంది. వైఎస్ జగన్ తండ్రి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే… ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ పదవిని నిర్వహించారు. ఇప్పుడు రెండు పదవులు వైఎస్ కుమారుడు జగన్ అప్పగించారు.
సాహిత్య రంగంలో చేసిన సేవలకు గాను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ, తెలుగు భాషలు రెండింటిలోనూ డాక్టరేట్లు పొందిన నిత్య పరిశోధకుడు. నలభైకి పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ‘తమస్’ అనువాదానికి, ‘ద్రౌపది’ నవలకు సృజనాత్మక రచనకు పొందారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ సభ్యుడుగా, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా పేరు పొందారు.
రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా, హిందీ భాష అమలుకు విశేష కృషి చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. దేశంలో ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దానికి మద్దతుగా యార్లగడ్డ వ్యాఖ్యలు చేశారు. మాతృభాషను మర్చిపోకుండా.. హిందీని నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు.. ఆంధ్రులకు హిందీపై అభిమానం పెంచడంలో…అటు అధికార భాషా సంఘం చైర్మన్ గా.. ఇటు హిందీ అకాడెమీ చైర్మన్ గా తన వంతు ప్రయత్నం చేయనున్నారు.