విభజన సమస్యలను కలసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుంటామని.. ఇక కేంద్రంతో సంబంధం ఏమీ ఉండదని…ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ధీమాగా ఉన్నాయి. పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. సీఎంల స్థాయిలో.. ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే అనూహ్యంగా.. మళ్లీ కేంద్రం సమక్షంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మిగిలి ఉన్న అన్ని సమస్యలను చర్చలతో పరిష్కరించుకుని.. ఓ రాజీ ఫార్ములాతోనే కేంద్రం వద్దకు వెళ్లాలనుకున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు…ఇప్పుడు.. మళ్లీ ఢిల్లీలో వాదోపవాదాలకు దిగాయి. కేంద్ర హోంశాఖలో జరిగిన ఏపీ పునర్విభజన చట్టం పెండింగ్ అంశాలపై చర్చలో ఒక్క దానిపైనా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.
షెడ్యూల్ 9, 10 ఉమ్మడి సంస్థల విభజనపై రాష్ట్రాల వివరణను కేంద్ర హోంశాఖ కోరింది. సింగరేణి కాలరీస్, ఆర్ టి సి, సివిల్ సప్లై కార్పొరేషన్ బకాయిలు, విద్యుత్ సంస్థలు,పలు కార్పొరేషన్ల విభజన అంశాలపై చర్చించారు. కానీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయారు. ఏపీ భవన్ అంశం మాత్రం చర్చకు రాలేదు. ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలు… ఉమ్మడిగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి సంస్థలు, విద్యుత్ బకాయిలు సహా… ఉద్యోగుల పంపిణీ విషయంలో.. ఇప్పటికీ రెండురాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని ఏపీ అంటూంటే… ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రానికేనని తెలంగాణ వాదిస్తోంది. ఈ క్రమంలో పీట ముడి పడింది.
ఏపీలో కొత్త సర్కార్ ఏర్పడగానే… పరిస్థితి మొత్తం మారిపోయింది. ఏపీకి చెందిన సెక్రటేరియట్ భవనాలను… తెలంగాణకు ఇచ్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతుగా ఏపీ సర్కార్ నిలిచింది.ఈ క్రమంలో… ఏపీకి మాత్రం ఒక్కటంటే ఒక్క గుడ్ న్యూస్ రాలేదు. కనీసం కరెంట్ బకాయిల విషయాన్ని కూడా తేల్చలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం… సమావేశమైనప్పుడల్లా… విభజన సమస్యల పరిష్కానికి చర్చలు జరిపామని ప్రకటనలు చేస్తూ ఉంటారు. కానీ.. అసలు సమస్యలు మాత్రం తేలడం లేదు. మళ్లీ కేంద్రం వద్దకే పంచాయతీకి వెళ్లాల్సి వచ్చింది.