తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా కోదండరాం… అనేక కార్యక్రమాలకు కార్యచరణ రూపొందించారు. అందులో… సకలజనుల సమ్మె కూడా ఒకటి. ఆ సమ్మె వల్ల ఉద్యమం విజయతీరాలకు చేరిందనే అభిప్రాయం ఉంది. కారణం ఏదైనా.. కోదండరాం.. తర్వాత టీఆర్ఎస్కు దూరమయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ .. తెలంగాణ ఫలాలన్నింటినీ పొందుతోంది. ఇప్పుడు.. అదే టీఆర్ఎస్ పై.. దండెత్తడానికి కోదండరాంకు అవకాశం లభించింది. టీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి సకల జనుల సమ్మెను ప్రయోగించాలని.. కోదండరాం భావిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘిభావంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం.. ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని… ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారుతుందని కోదండరాం ప్రకటించారు.
ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో జీతాలు, జీవితాలు పణంగా పెట్టినా.. సమైక్య రాష్ట్రంలోలాగే తమ పరిస్థితి ఉందని అంటున్నారు. ఉద్యమం సందర్భంగా.. కేసీఆర్ ఇచ్చిన హామీలేమీ నెరవేరలేదని అంటున్నారు. పైగా… తాము గొంతెమ్మ కోరికలు కోరుతున్నామని, లంచాలు తీసుకుంటున్నామన్నట్లుగా ప్రచారం చేస్తూ.. ప్రజలను తమపై రెచ్చగొడుతున్నారన్న ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశమవుతోంది. యాభై వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశామన్నట్లుగా కేసీఆర్ ప్రకటించడం.. ఇతర ఉద్యోగుల్ని కూడా… అసంతృప్తికి గురి చేసింది. ప్రభుత్వం ఏం చేసినా పట్టకుండా ఉంటే.. తర్వాత తమ పరిస్థితి అలానే ఉంటుందన్న అభిప్రాయం ఇతర ఉద్యోగ సంఘాల్లోనూ వ్యక్తమవుతోంది.
నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు బలంగా ఉండేవి. ఉద్యమ వేడితో.. అప్పుడు ఉన్న నాయకత్వాన్ని ఉద్యోగులందరూ బలపరిచారు. ఆ ఉద్యోగ సంఘ నాయకులు… చివరికి టీఆర్ఎస్ నేతలైపోయారు. స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు పదవులు అలంకరించారు. తర్వాతి నాయకత్వం కూడా… రాజకీయాల్లోకి వచ్చింది. దాంతో.. ఉద్యోగులకు బలమైన నాయకత్వం కరవైపోయింది. ఇప్పుడు.. వారి తరపున ప్రభుత్వంపై గట్టిగా పోరాడే నేత కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో కోదండరాం.. సకల జనుల సమ్మెను ఎలా మేనేజ్ చేస్తారనేది ఆసక్తికరమే…!