హుజూర్నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా కారణంగా ఏర్పడ్డ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేయకపోవడం చర్చకు దారితీసింది. వైఎస్ఆర్ సీపీ తెలంగాణలో పోటీ చేయకపోవడానికి కారణాలు ఏమిటన్న దానిపై రాజకీయ విశ్లేషకుల లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
2014 లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ:
తెలంగాణలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి బాగానే అభిమానులు ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. బహుశా అందువల్లనే, వైయస్ జగన్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినప్పటికీ కూడా 2014 ఎన్నికలలో ఆ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్సీపీకి మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక్క ఎంపీ సీటు ఇచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి పెట్టడం కోసం తెలంగాణ రాజకీయాలను పూర్తిగా జగన్ పక్కన పెట్టడం తో గెలిచిన నాయకులు సైతం వారి దారులు వారు చూసుకున్నారు. ఇక తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్సిపి క్యాడర్ కూడా చెల్లాచెదురు అయిపోయింది.
2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయని వైఎస్సార్ సీపీ:
2014లో ప్రజాదరణ చూరగొన్నప్పటికి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులని నిలబెట్టలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మీద దృష్టి సారించాల్సి ఉంది కాబట్టి తెలంగాణలో పోటీ చేయడం లేదని, 2024 ఎన్నికలలో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని (నిజానికి తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2023 లో ఉంటాయి, జమిలి రాక పోతే) అప్పట్లో వైఎస్ఆర్సిపి అధికారికంగా ప్రకటన చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే కారణంతో వైఎస్ఆర్సిపి తెలంగాణలో పోటీ చేయలేదు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన తర్వాత, ఇప్పుడు హుజూర్నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా కారణంగా ఏర్పడ్డ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అభిమానులు భావించారు.
తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ దుకాణం ఎత్తేసినట్టేనా ?
2014 ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకి మూడు ఎమ్మెల్యే సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి దాదాపు 20 సీట్లు వచ్చాయి. అయితే సాక్షి పత్రిక మాత్రం, 2014 – 2018 మధ్యలో, తెలంగాణలో టీడీపీ దుకాణం ఎత్తేసింది అని, తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది అని పలు దఫాలుగా కథనాలు ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి నప్పుడు ఇది అన్యాయం అంటూ పెద్ద పెద్ద కథనాలు రాసిన సాక్షి, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు మాత్రం టిడిపి దుకాణం సర్దేసింది అంటూ కథనాలు రాసింది. అయితే మొత్తానికి సాక్షి కోరుకున్నట్టే టిడిపి పార్టీ తెలంగాణ లో ఉనికి కోల్పోయింది. అయినప్పటికీ హుజూర్నగర్ ఎన్నికలలో పోటీ చేస్తూ, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్ సీపీ మాత్రం, ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నప్పటికీ, పోటీ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ పోటి చేయక పోవడం చూస్తుంటే వైఎస్సార్ సీపీ తెలంగాణలో దుకాణం ఎత్తేసినట్లే అని ఆ పార్టీ విమర్శకులు అంటున్నారు.
వైఎస్సార్ సీపీ కేసీఆర్ కి బీ-టీమ్ గా వ్యవహరిస్తోందా?
వైఎస్సార్ సీపీ తెలంగాణలో పోటీ చేయకపోవడానికి మరొక కారణం, వైఎస్సార్ సీపీ కేసీఆర్ కి బీ-టీమ్ గా వ్యవహరించడమని మరొక అభిప్రాయం వినపడుతోంది. ఎన్నికలు అయిపోయిన వెంటనే విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కడం, జగన్ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తులను తెలంగాణ కి అప్పగించడం సహా మరెన్నో నిర్ణయాలలో కేసీఆర్ కు లబ్ది కలిగేలా వ్యవహరించడం, ఇవన్నీ చూస్తుంటే వైయస్ జగన్ కేసీఆర్ ని పల్లెత్తు మాట అనే పరిస్థితిలో ప్రస్తుతం లేడని, ఇటువంటి పరిస్థితుల్లో హుజూర్నగర్ ఎన్నికలలో పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం కూడా సాధ్యం కాదని, అందువల్లే ప్రస్తుత ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ సిపి దూరంగా ఉంటుందని మరొక వాదన వినిపిస్తోంది.
మరి భవిష్యత్తులో నైనా , కేసీఆర్ చెప్పినట్టల్లా జగన్ ఆడుతున్నాడనే ముద్ర నుండి జగన్ బయట పడతాడా, తెలంగాణలో పార్టీని కూడా కాపాడుకుంటాడా అన్నది వేచి చూడాలి