పార్టీ భవిష్యత్తు వ్యూహంపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. అన్ని స్థాయిల్లో మహిళలకు 33 శాతం అవకాశాలు ఉంటాయన్నారు. తాను ఇంతవరకూ కొంత కన్జర్వేటివ్ గా ఆలోచిస్తూ వచ్చాననీ, కానీ ఇప్పుడా ధోరణి మార్చుకుంటూ భవిష్యత్తులో మొహమాటం లేకుండా సమర్థులకు పార్టీలో పెద్ద పీట వేస్తా అన్నారు. తనపై అభిమానంతో ఉన్నవారికి కాఫీ ఇస్తా, భోజనం పెడతా, కావాలంటే వాళ్లతో కాస్త టైం స్పెండ్ చేస్తానుగానీ… పదవులు ఇచ్చేది సమర్థులకు మాత్రమే అన్నారు. పార్టీ నాలుగు కాలాలపాటు ఉండాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదన్నారు. కార్యకర్తలు అందరితో మాట్లాడతాననీ, వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వల్ల పార్టీకి ఉపయోగం ఉండదన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి, సంస్థాగతంగా పార్టీని నిర్మించే ప్రయత్నం చేసుకుందామన్నారు. మరో ముప్ఫయ్యేళ్లపాటు పార్టీని తిరుగులేని శక్తిగా నిర్మించేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటా అన్నారు.
ఇదే సమయంలో జగన్ సర్కారు తీరుపై కూడా చాలా విమర్శలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతుంటే కరెంటు పోయింది. దీంతో ఆయన స్పందిస్తూ… కరెంటు గురించి మాట్లాడదామంటే కరెంటు పోయే పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో కరెంటు కొరత లేకుండా చేశామనీ, విద్యుత్ ఛార్జీలు కూడా పెంచలేదన్నారు. కానీ, జగన్ సీఎం అయ్యాక చీకటి మొదలైందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ అభివృద్ధి చేసుకుంటూ వస్తే… తరువాత వచ్చిన ప్రభుత్వాలు వెనక్కి తీసుకెళ్తున్నాయన్నారు. గతంలో వైయస్సార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారనీ, మళ్లీ అభివృద్ధి చేశామనీ, ఇప్పుడు మళ్లీ అదే జరుగుతోందనీ, జగన్ వచ్చి నష్టాల్లో పడేస్తున్న పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.
పార్టీపరంగా మార్పులు చేర్పులూ అవసరమనేది ఇప్పటికే చాలామంది నుంచి వ్యక్తమౌతున్న అంశం. పార్టీలో కొత్త తరానికి నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశం చంద్రబాబు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో తరం మారాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఆ దిశగానే చంద్రబాబు చర్యలుండేట్టున్నాయి. ఈ క్రమంలో సీనియర్లను పక్కనపెట్టేస్తామని చెప్పకనే ఆయన చెబుతున్నారు! సీనియర్లకు ఇకపై గౌరవం మాత్రమే ఇవ్వగలననీ, పదవులు కాదని స్పష్టంగా అంటున్నారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.