ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. శుక్రవారమే ఆయన ఢిల్లీ పర్యటన ఉందని.. అధికారవర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఐదు రోజుల కిందటే.. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో ముప్పావు గంట సేపు భేటీ అయ్యారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లి ..ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని ఇంటికి వెళ్లి… భేటీ తర్వాత నేరుగా… విజయవాడ వచ్చేశారు. ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు. అప్పుడే… కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులను కలవాలనుకున్నప్పటికీ.. ఎవరి అపాయింట్‌మెంట్లు ఖరారు కాలేదు. దాంతో వారి అపాయింట్‌మెంట్లు ఖరారు చేసుకుని శుక్రవారం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు.. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఈ ఒత్తిళ్లు.. అటు వ్యక్తిగతంగానూ.. ఇటు ఆర్థిక పరంగానూ ఉంటున్నాయి. సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంలో ఏపీ సర్కార్ పెద్దలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయాన్ని కోర్టులో సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురువుతాయన్న ఆందోళనలో ఉన్నారు. వారం వారం కోర్టుకెళ్లే ముఖ్యమంత్రిగా కొనసాగడం ఇబ్బందికరం అవుతుంది. అదే సమయంలో… ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వ్యక్తిగత లబ్ది పథకాలకు రూ. వేల కోట్ల నిధులు అవసరం. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా తగ్గిపోయాయి. రావాల్సిన నిధులనైనా త్వరగా విడుదల చేయాలని .. జగన్ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పదిహేనో తేదీన యాభై లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ. 12,500 వేయాల్సి ఉంది. ఇప్పుడు వాటికి నిధులు సర్దుబాటు కాని పరిస్థితి ఉంది. ఇక ఎస్బీఐ లాంటి బ్యాంకులు… రుణాలిచ్చేందుకు కూడా సిద్ధంగా లేవు. వీటన్నింటిపై ఆర్థిక మంత్రితో జగన్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అందుకే… కుదిరితే శనివారం కూడా ఢిల్లీలో ఉండి.. అందర్నీ కలిసి రావాలనే ఆలోచన ఏపీ సీఎం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.