రవిప్రకాష్‌పై అక్రమంగా ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ… సీబీఐ, ఈడీ, ఐటీలతో దర్యాప్తు చేయించాలంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై… రవిప్రకాష్ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విజయసాయిరెడ్డిపై రూ. వంద కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నారు. తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని రవిప్రకాష్ అంటున్నారు. అలంద మీడియా పెట్టిన “బోనస్” కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న రవిప్రకాష్… ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరువు నష్టం దావాకు న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభించాలని.. తనతో భేటీకి వచ్చిన న్యాయవాదులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు.. విజయసాయిరెడ్డి లేఖ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. అసలు మనీలాండరింగ్ లాంటి వ్యవహారాల్లో నిపుణుడై.. అలాంటి కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చిన విజయసాయిరెడ్డి.. ఇతరులపై… అవే ఆరోపణలు చేయడం.. సిగ్గుచేటని టీడీపీ మండిపడింది. సీజేఐకు లేఖ రాయడం వెనుక దురుద్దేశం ఉందని.. ఆ పార్టీ ఎంపీ, లీగల్ సెల్ నేత కనకమేడల రవీంద్రకుమార్ కుమార్ ఆరోపించారు. రవిప్రకాష్ బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ జరుపుతున్నందున.. దాన్ని ప్రభావితం చేసేందుకే… సీజేఐకి లేఖ రాసి… దాన్ని మీడియాకు విడుదల చేశారని.. ఆయనంటున్నారు.
రవిప్రకాష్ అరెస్ట్ వ్యవహారం.. ఆ తర్వాత ఏ సంబంధమూ లేని విజయసాయిరెడ్డి సీజేఐకి లేఖ రాయడం.. అన్నీ ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని రవిప్రకాష్ వర్గీయులు అంటున్నారు. అసలు.. ఈ విషయంలో బయటకు రాని చాలా అంశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం… రవిప్రకాష్.. విజయసాయిరెడ్డిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆయన పరువు నష్టం పిటిషన్ వేస్తే… సీజేఐకి రాసిన లేఖపై.. విజయసాయిరెడ్డి తప్పనిసరిగా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించకపోతే… ఆయన లేఖ ఎందుకు.. ఎవరి కోసం రాశారో… బయట పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా అయినా.. అసలు.. ఈ ” టీవీ9″ డీల్ చుట్టూ తిరుగుతున్న వ్యవహారం అయినా బయటకు వస్తుందేమోనన్న చర్చ ప్రారంభమయింది.