ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంట్ కొరతతో సతమతమవుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా కరెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక.. విద్యుత్ ఎక్సేంజీల్లో, ఇతర చోట్ల యూనిట్ రూ.11.68 చొప్పున విద్యుత్ కొనుగోలు చేస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. సౌర, పవన విద్యుత్ యూనిట్ రూ. నాలుగుకే వస్తూంటే.. అధిక ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారని.. ఇప్పుడు రూ.11.68 పెట్టి కొనుగోలు చేయడమేమిటని ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో.. ఓ వివరణ పత్రాన్ని మీడియాకు పంపింది. అందుకే.. తాము విద్యుత్ కొనుగోలు చేయడానికి.. అంత రేటు పెట్టడానికి చంద్రబాబే కారణం అంటూ… లాజిక్ వివరించారు.
కర్ణాటకలోని కుడిగి విద్యుత్ ప్లాంట్‌తో.. ఏపీ సర్కార్‌కు పీపీఏ ఉందని.. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్ తీసుకోలేదని… ప్రస్తుత ఏపీ సర్కార్ చెబుతోంది. అందువల్ల.. ఇప్పుడు తీసుకోవడం వల్ల అంత రేటు పెట్టాల్సి వస్తుందనే విచిత్రమైన వాదనను తెరమీదకు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అసలు పీపీఏలనే… పట్టించుకునే పరిస్థితిలో ఏపీ సర్కార్ లేదు. అలాంటప్పుడు… కుడిగి విద్యుత్ ప్లాంట్ విషయంలో.. అంత రేటు ఎక్కువైతే.. అసలు పీపీఏను క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా.. అనే ప్రశ్న సహజంగానే వస్తోంది. తప్పనిసరిగా ఎందుకు కొనుగోలు చేయాలనే వాదన వినిపిస్తోంది. సౌర, పవన విద్యుత్ కొనుగోలు నిలిపివేసినట్లు.. ఆ విద్యుత్ ను కూడా తీసుకోవడం నిలిపివేయాలి కదా..అనే సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి.
నిజానికి అసలు కుడిగి విద్యుత్ ప్లాంట్ నుంచి.. ఏపీకి విద్యుత్ అదనంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేయడంతో.. కరెంట్ కొరత రావడంతో.. అదనంగా విద్యుత్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో.. సహజంగానే అధిక రేటు పెట్టాల్సి వస్తోంది. ఇది పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే వచ్చిన పరిస్థితని.. విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ… గత ప్రభుత్వంపై నిందలేస్తూ… తమ ఈగో సమస్యల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.