భారతీయ జనతా పార్టీతో గొడవలు పెట్టుకోవడం వల్ల… ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి లాభం జరగలేదు సరికదా.. తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందని.. చంద్రబాబు విశాఖలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు వరకూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ… ఏపీకి కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదని ఆరోపిస్తూ… కటిఫ్ చెప్పేసింది. జగన్ ను దగ్గరకు తీస్తున్నారన్న అనుమానాల కారణంగానే… చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే.. కారణాలు ఏమైనా అంతిమంగా.. కాలింది మాత్రం.. టీడీపీ చేతులే. అందుకే..ఇప్పుడు అధినేత చంద్రబాబు… ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో రాజకీయ పరమైన గొడవలు తప్ప.. మోడీతో వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవంటున్నారు. అవసరమున్నా .. లేకపోయినా… బీజేపీ ప్రస్తావన తెచ్చి.. బీజేపీ తప్పేమీ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం.. రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.
ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే కేంద్రానికి.. బీజేపీకి ఎదురెళ్లే సాహసం ఏ ప్రాంతీయ పార్టీ కూడా చేసే పరిస్థితిలో లేదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా అర్థం అయినట్లుగా ఉంది. తమ పార్టీకి చెందిన ఎంపీలు నలుగురు అదీ కూడా… తన కుడిభుజాల్లాంటి వారు బీజేపీలో చేరినా.. ఆయన ఎలాంటి తీవ్ర విమర్శలు చేయలేదు. బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక పలువురు టీడీపీ నేతల్ని బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా.. సంయమనం పాటిస్తున్నారు. ఈ క్రమంలో.. బీజేపీతో మళ్లీ సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే.. బీజేపీపై విమర్శలు చేయడం లేదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీలో ఉన్న నేతల్లో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉండేవారు. టీడీపీ పదవులు ఇచ్చినప్పటికీ వారు.. జగన్ అనుకూలంగా ప్రకటనలు చేస్తూ ఉండేవారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు.. ఏపీ బీజేపీలో.. టీడీపీకి అనుకూలంగా ఉండేవారి ప్రాబల్యం పెరిగింది. టీడీపీ నుంచి వెళ్లి చేరిన వారు హైకమాండ్ వద్ద ప్రాబల్యం సంపాదించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వ్యవహారశైలితో.. మిగిలిన కొంత మంది దూరంగా జరిగారు. దాంతో… ఇప్పుడు.. బీజేపీలో వైసీపీ సమర్థకులు తగ్గిపోయారు. వైసీపీ కన్నా.. టీడీపీనే బెటర్ అనేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.