పాపం.. శ్రీకాంత్ అడ్డాలకు అస్సలు టైమ్ కలసి రావడం లేదు. కావల్సినంత టాలెంట్ ఉన్నా, క్లాస్ సినిమాల దర్శకుడు అని పేరు తెచ్చుకున్నా, ఇప్పుడు తన దగ్గర ఒక్క సినిమా కూడా లేదు. గీతా ఆర్ట్స్ పిలిచి అవకాశం ఇచ్చినా, హీరోని పట్టుకోలేకపోతున్నాడు. కథలు రెడీ చేస్తున్నా – అవి గీతా ఆర్ట్స్‌కి ఏమాత్రం ఎక్కడం లేదు. ఈమధ్య ఓ ఫ్యామిలీ డ్రామాని సెట్ చేసి అల్లు అరవింద్‌కి వినిపించాడట. ఆ కథ బాగానే ఉన్నా, సరిగ్గా అలాంటి లైన్‌తోనే మారుతి `ప్రతిరోజూ పండగ` చేస్తుండడంతో ఆ కథని పక్కన పెట్టేయాల్సివచ్చింది. నిజానికి ఈ కథని రెండేళ్ల క్రితమే రాసుకున్నాడట శ్రీకాంత్. అప్పుడే అల్లు అరవింద్‌కి వినిపించి ఉంటే బాగుండేది. అన్నట్టు.. మారుతి సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే తెరకెక్కుతోంది. ఓ సంస్థకు పనిచేస్తున్న ఇద్దరు దర్శకులు ఒకేలాంటి కథని అల్లు అరవింద్‌కి వినిపించారన్నమాట. తొలి అడుగు మారుతిది పడింది కాబట్టి, ఆ ప్రాజెక్టు సెట్ అయ్యింది. కాస్త లేట్ చేయడం వల్ల.. శ్రీకాంత్ కథ పక్కన పెట్టాల్సివచ్చింది. ఒకే థాట్ ఇద్దరు దర్శకులకు వచ్చిందంటే… ఈ కథకు స్ఫూర్తి ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది. మారుతి వల్ల… ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కథ మార్చుకోవాల్సివస్తోంది. మళ్లీ కథ రెడీ చేయడానికి ఎంత టైమ్ తీసుకుంటాడో మరి.