గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఘర్షణలు సహజంగానే జరుగుతూంటాయని… వాటికి రాజకీయాలకు సంబంధం లేదని పోలీసులు డిక్లరేషన్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో దాడులు, హత్యలు జరిగాయని… అనేక మంది టీడీపీ సానుభూతి పరులు గ్రామాలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పోరుబాట పట్టారు. చలో పల్నాడు కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పల్నాడులో పరిస్థితులపై టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నింటినీ విచారణ చేయాలంటూ… ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఓ కమిటీని డీజీపీ నియమించారు. నెల రోజుల పాటు… అన్ని కేసులను పరిశీలించిన రవిశంకర్ కమిటీ… టీడీపీ చెప్పిన గొడవలు, ఘర్షణలు నిజమే కానీ.. వాటికి రాజకీయాలతో సంబంధం లేదని… రిపోర్ట్ రెడీ చేశారు.
పల్నాడులో ఎనిమిది మంది టీడీపీ నేతలను.. ఎన్నికలు ముగిసిన తర్వాత హత్య చేశారని.. టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. విచారణ జరిపిన ఏడీజీ కమిటీ ఇందులో ఒక్కటంటే.. ఒక్కటి మాత్రమే రాజకీయ హత్య అని.. మిగతావన్నీ.. రౌడీ గ్రూపుల మధ్య జరిగిన గొడవలని తేల్చారు. అంతే కాదు.. పల్నాడులో ఘర్షణలు సహజమన్నట్లుగా… మాట్లాడిన పోలీసులు …. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో వైసీపీ నేతలపైనే ఎక్కువగా కేసులు పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. పల్నాడులో 70మందికిపైగా వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టగా.. టీడీపీ వారిపై 40 కేసులు మాత్రమే పెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పల్నాడులో జరిగినవన్నీ రాజకీయ ఘర్షణలు కాదని… గ్రామాల్లో గ్రూపుల మధ్య జరిగే గొడవలను రాజకీయ ఘర్షణలుగా చెబుతున్నారని… పోలీసులు చెబుతున్నారు.
పల్నాడులో పరిస్థితి అంతా మెరుగ్గా ఉందని.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని చెప్పడానికి పోలీసులు తాపత్రయపడ్డారు. అయితే.. గతంలో లేని విధంగా ఎన్నికల తర్వాత అనేక ఘటనలు జరిగాయన్న విషయాన్ని మాత్రం అంగీకరించారు. ఎనిమది హత్యలు జరిగింది నిజమేనని కూడా అంగీకరించారు. అయితే.. ఎన్ని జరిగినా.. అవన్నీ రాజకీయ సంబంధం కాదని చెప్పి.. పరిస్థితిని తేలిక చేసే ప్రయత్నం చేశారు కానీ.. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే.. అన్నిఘటనలు ఎందుకు జరుగుతాయన్న విషయాన్ని మాత్రం.. వివరించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ… పల్నాడులో పరిస్థితులపై రెండు పుస్తకాలు ముద్రించింది. ఆ పుస్తకాల్లో ఉన్న వివరాలు నిజమే కానీ.. బాధితులకు రాజకీయాలతో సంబంధం లేదని వాదనను పోలీసులు వినిపిస్తున్నారు. పల్నాడులో పరిస్థితులు బాగున్నాయని చెప్పడానికే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు.