జనసేన అధినేత పవన్ కల్యాణ్ గంగా ప్రక్షాళన కోసం తన వంతు కృషి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన హరిద్వార్‌లో ఉన్నారు. గతంలో పలుమార్లు సినమా షూటింగ్‌ల కోసం… హరిద్వార్ వెళ్లిన పవన్ కల్యాణ్ ఈ సారి మాత్రం ఓ సామాజిక కార్యకర్తగా వెళ్లారు. గంగా నది స్వచ్చత కోసం… జీవితాంతం శ్రమించి తనువును త్యాగం చేసిన .. జీడీ అగర్వాల్ అనే మహామహునికి అశ్రువొక్కటి ధారబోసేందుకు వెళ్లారు. గంగా నది కార్యకర్త, ప్రముఖ పర్యావరణవేత్త జీడీ అగర్వాల్ గత ఏడాది కన్నుమూశారు. గంగా నది ప్రక్షాళన కోరుతూ అగర్వాల్ నిరవదిక నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, ఉత్తరకాశీల మధ్య గంగానది ప్రవాహానికి అంతరాయం కలుగకుండా చేయడంతో పాటు గంగా నది పరిరక్షణకు చట్టం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ నిరాహారదీక్షకు దిగారు.
2009లో సైతం భగీరథి నదిపై డ్యాం నిర్మాణాన్ని బంద్ చేయాలని కోరుతూ దీక్షకు దిగారు. జీడీ అగర్వాల్ గతంలో ఐఐటీ కాన్పూర్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. జీడీ అగర్వాల్ ప్రథమ వర్థంతికి రావాల్సిందిగా.. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. జీడీ అగర్వాల్ పోరాటంపై ఎంతో గౌరవం ఉన్న పవన్ కల్యాణ్.. దీనికి వెంటనే అంగీకరించారు. వెన్నునొప్పితో బాధపడుతున్నా.. హరిద్వార్ వెళ్లారు. మహత్తర కార్యక్రమం కోసం ప్రాణాలు అర్పించడం తనను కలిచి వేసిందని .. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని పిలుపునిచ్చారు.
జీడీ అగర్వాల్ మృతితో ప్రజలు తిరగబడతారని అనుకున్నా.. కనీస స్పందన లేకపోవడంపై… పవన్ కల్యాణ్ ప్రథమ వర్థంతి సభలో ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుండి పెద్దగా మద్దతు రావడం లేదని ఆ లోటును భర్తీ చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. సాదాసీదాగ ఉన్న గదిలో బస చేశారు. అందులో ఓ బెడ్ తప్ప మరేమీ లేవు. ఈ ఫోటోలను జనసేన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పవన్ సింపుల్ లైఫ్ ను ప్రజలకు వివరించారు.