మరో రిలీజ్ డే క్లాష్…
అటు బన్నీ, ఇటు మహేష్..
ఇద్దరికీ 12వ తేదీనే కావాలి. మరి ఇద్దరూ ఢీ అంటూ ఢీ కొట్టుకుంటే, ఈ మేటర్ ఎలా తేలుతుంది?
ఈ సంక్రాంతికి చాలా సినిమాలు లిస్టులో ఉన్నాయి. అయితే రెండు సినిమాలపై మాత్రం జనాలు దృష్టి పెట్టారు. అందులో ఒకటి మహేష్ సినిమా, రెండోది బన్నీ సినిమా. సరిలేరు నీకెవ్వరు సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ముందెప్పుడో ఫిక్సయిపోయింది. ఆ తరవాత అల వైకుంఠపురం కూడా సంక్రాంతికి వస్తున్నామని చెప్పింది. అయితే.. వీళ్లలో ఎవరూ రిలీజ్ డేట్లు ముందే ఫిక్స్ చేసుకోలేదు. రెండు సినిమాల మధ్య కనీసం రెండు రోజులైనా గ్యాప్ ఉంటుందని భావించారు. కాకపోతే.. ముందు ఎవరు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు? ఎవరు రెండు రోజుల గ్యాప్ తో వస్తారు? అనే ప్రశ్నలు తప్ప, ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. తీరా చూస్తే ఈ రోజు బన్నీ సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 అని ఫిక్స్ చేశారు. ఆ పోస్టర్ వదిలి గంట గడవకముందే.. మహేష్ టీమ్ కూడా రిలీజ్ డేట్ ప్రకటించింది వాళ్లూ జనవరి 12నే వస్తున్నారు. అలా 12న రెండు పెద్ద సినిమాలు ఢీ కొట్టుకుంటున్నాయి.
సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు రావడం మామూలే. సీజన్ అలాంటిది. మామూలు రోజుల్లో అయితే… పెద్ద సినిమాల మధ్య క్లాష్ ఎందుకు అనుకుంటారు. కనీసం వారం గ్యాప్ ఇవ్వాలనుకుంటారు. కానీ సంక్రాంతి సీజన్లో అలా కాదు. ఒక రోజు గ్యాప్ దొరికినా చాలు. కాకపోతే మరీ ఒకే రోజు రెండు పెద్ద సినిమాలంటేనే.. కాస్త కష్టమైన వ్యవహారం. సరిలేరు నీకెవ్వరుకి థియేటర్లు చూపించే బాధ్యత దిల్ రాజు తీసుకుంటారు. బన్నీ సినిమా అంటే.. ఆ బాధ్యత అల్లు అరవింద్‌దే. వీళ్లదిద్దరి చేతుల్లోనూ కావల్సినన్ని థియేటర్లున్నాయి. కాకపోతే.. ఒకే సినిమాకి రావాల్సిన థియేటర్లని పంచుకోవాల్సివస్తుంది.
నిజానికి జనవరి 10 మంచి డేట్. ఆ రోజున విడుదలైతే.. సంక్రాంతి ముగిసే వరకూ వసూళ్లు కుమ్ముకోవచ్చు. కాకపోతే.. పండక్కి కాస్త ముందు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. 12 ఆదివారం వచ్చింది. మామూలుగా అయితే ఆదివారం సినిమాల విడుదలకు ఆర్డ్ డే. సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ పట్టింపు ఉండదు. సరిగ్గా సంక్రాంతి సీజన్లో సినిమా వదిలినట్టు ఉంటుంది. శుక్రవారం సినిమా విడుదలైతే.. టౌన్లో ఉండేవాళ్లు పల్లెటూర్లకు వెళ్లే హడావుడిలో ఉంటారు. సినిమాలపై పెద్దగా ఫోకస్ ఉండదు. ఆదివారం అయితే… ఆ ఇబ్బంది తగ్గుతుంది. అందుకే.. ఆదివారం విడుదల చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన నిర్మాతల్లో ఉంది. అందకే ఇద్దరూ పోటాపోటీగా 12 వ తేదీనే కావాలంటున్నారు.
ఇద్దరూ ఒకే తేదీ ప్రకటించినా, ఈ పోటీ నుంచి ఒకరు కచ్చితంగా డ్రాప్ అయ్యే ఛాన్సుంది. ఎందుకంటే ఒకేరోజు రెండు పెద్ద సినిమాలొస్తే ఆ ఎఫెక్ట్ కచ్చితంగా రెండు సినిమాలపైనా పడుతుంది. ఎలాగూ రిలీజ్ డేట్‌కి ఇంకా టైమ్ ఉంది. కూర్చుని మాట్లాడుకునేందుకు బోల్డంత స్కోప్ ఉంది. రిలీజ్ డేట్లలో మార్పులొచ్చే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి.