వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రధానమైన సమస్యగా ఇసుక కొరత కనిపించింది. కొత్త విధానం అవసరమనీ, గత టీడీపీ అనుసరించిన విధానాలు రద్దంటూ ఇసుకను అందుబాటులో లేకుండా చేశారు. దాంతో నిర్మాణ రంగం కుదేలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది! అయితే, కొత్త ఇసుక విధానాన్ని గత నెల నుంచే అమల్లోకి తీసుకొచ్చింది జగన్ సర్కారు. ఇంకేముంది, కొరత త్వరలోనే తీరిపోతుందని చెప్పుకొచ్చారు. కానీ, నెల గడుస్తున్నా ఇసుక కొరత సమస్య అలానే ఉంది. ఇప్పుడు హుటాహుటిన చర్యలు చేపడుతున్నట్టుగా పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. ఇసుక లభ్యతను రోజుకు లక్ష టన్నులు పెంచాలని అధికారులకు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు తగ్గిన వెంటనే 150 రీచుల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభిస్తామన్నారు. పట్టాభూముల్లో ఉన్న ఇసుకను కూడా అవసరమైతే తవ్వకాలు జరిపించి సరఫరా చేసి కొరత తీర్చేస్తామన్నారు.
ఇసుక కొరతను తీర్చేందుకు చేపట్టిన చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వరదల కారణంగానే సరఫరాలో జాప్యమని ఇప్పుడు మంత్రి చెబుతున్నారు, కానీ కొత్త విధానం అమల్లోకి వచ్చింది గత నెల నుంచి కదా! నిజానికి, కొత్త విధానం ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ… త్వరలోనే రాష్ట్రంలో అన్ని చోట్లా ఇసుకను అందుబాటులో ఉండేట్టు చేయాలనీ, రీచ్ లలో నిల్వలు పెంచాలంటూ కూడా అధికారులకు చెప్పారు. ఆ లెక్కన కొత్త విధానం అమల్లోకి వచ్చిన వెంటనే కొరత తీరాల్సి ఉంది! కానీ, అలా జరగలేదు. ఇప్పుడేమో.. వరదలు కారణమని కొత్తగా చెబుతున్నారు. ఇసుక సరఫరా బాధ్యతలు మైనింగ్ శాఖకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కదా మేం బాధ్యతలు తీసుకున్నది, లభ్యత జాప్యానికి కారణం ఏమంటే మేమేం చెప్పగలం అన్నట్టుగా అధికారులు స్పందిస్తున్న పరిస్థితి ఉంది.
వరదలు లేనంత కాలం ఇసుక తవ్వకాలను ఆపేశారు, సరిగ్గా వరదలు వచ్చిన సమయంలోనే తవ్వకాలకు సిద్ధపడ్డామని చెబుతున్నారు! వ్యూహాత్మక లోపం ఇక్కడే ఉంది. కొత్త విధానం అమల్లోకి వస్తుందని వారే ముందు నుంచీ చెబుతున్నప్పుడు… కొరతను దృష్టిలో పెట్టుకుని నిల్వలు పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఆ పని ప్రభుత్వం నుంచి జరగలేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోటి… ఇసుక లభ్యతను మరింత సులభతరం చేస్తామని చెప్పి, దాన్ని మరింత జఠిలం చేసేశారు అనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. తవ్వడానికి, స్టాక్ యార్డుకి తరలించడానికి, అక్కడి నుంచి కొనుక్కున్నవారు తరలించుకోవడానికీ… ఇలా ఎక్కడికి అక్కడ కొత్త రేట్లున్నాయి. రాష్ట్ర స్థాయిలో కొత్త ఇసుక విధానం తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్నా… క్షేత్రస్థాయిలో అమలు దగ్గరకి వచ్చేసరికి వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు చర్యలు అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తున్నా… క్షేత్ర స్థాయిలో కొరత తీరేసరికి ఇంకాస్త సమయం పడుతుందనే అనిపిస్తోంది.