వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి కొద్ది కాలంలోనే ఏపీ సర్కార్ రూ. 30వేల కోట్ల అప్పులు చేసినట్లుగా ఏపీ ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ పరిధిలోని అప్పులే రూ. పదహారు వేల కోట్లు తీసుకోగా.. కార్పొరేషన్లు, ఇతర ప్రైవేటు అప్పులు.. రూ. పది వేల కోట్లు దాటిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల ద్వారా మరో రూ. పదివేల కోట్ల అప్పు ప్రతిపాదనలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద ఉన్నాయి. వీటిలో కొన్ని మంజూరు దశలో ఉన్నాయని తెలుస్తోంది. అతి కొద్ది సమయంలోనే.. ఇంత పెద్ద మొత్తం అప్పులు గత సర్కార్ కూడా చేయలేదు.
ఐదేళ్లలో చంద్రబాబునాయుడు రూ. రెండు లక్షల కోట్ల అప్పు చేశారని.. వాటిని తీర్చడానికి తంటాలు పడుతున్నామంటూ.. కొత్త ప్రభుత్వం చెబుతోంది. కానీ ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు రూ. లక్షా పన్నెండు వేల కోట్లు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాటాగా వచ్చిన అప్పులు రూ. లక్షా నలభై ఎనిమిది వేల కోట్లు. అయితే.. ఈ ఆర్థిక సంవత్సంలో కొత్త ప్రభుత్వం మాత్రం… మొదటి రెండేళ్లలోనే గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసినంత అప్పును చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే బడ్జెటేతర అప్పులను కూడా.. బడ్జెట్ అప్పులతో పాటుగా చేయడమే దీనికి కారణం. ఇప్పటికే రూ. 30వేల కోట్లు అప్పు అంటే.. ఈ ఏడాది.. చేసే అప్పు రూ. అరవై వేల కోట్లు దాటిపోతుందని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూస్తే.. ఈ మొత్తం.. ఏడాదిలో రూ. లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదనే వాదన వారి నుంచి వినిపిస్తోంది.
ఓ వైపు ఖర్చు పెంచుకుంటూ పోవడం.. మరో వైపు ఆదాయం పడిపోవడంతో.. పూర్తిగా… గ్యాప్‌ను.. అప్పుల ద్వారా భర్తీ చేస్తోంది ప్రభుత్వం. ఎంత వడ్డీ అని చూసుకోకుండా.. అప్పులిచ్చే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ఏదైనా… వదిలి పెట్టడం లేదు. కార్పొరేషన్ల ద్వారా.. రుణాలకు వెళ్లిపోతున్నారు. ఇవి బడ్జెటేతర అప్పుల కిందకు వస్తాయి. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆయా రుణాలను మాత్రం ప్రభుత్వం వాడేసుకుంటుంది. ఆయా కార్పొరేషన్లకు కేటాయించరు. పరిస్థితి అలాగే కొనసాగితే.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వెనిజులాలా మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీఎస్డీపీ పెరిగితేనే… అప్పు పుడుతుంది.. ఇప్పుడు అదీ కూడా తిరోగమన దిశలో ఉంది. అందుకే.. సర్కార్ ఆర్థిక క్రమశిక్షణను కోల్పోతోంది.