కాంగ్రెస్ పార్టీకి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యను పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించగానే ఎంపీ రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. దీంతో నల్గొండ జిల్లాకి చెందిన కాంగ్రెస్ నేతలంతా రేవంత్ కి వ్యతిరేకంగా ఒక గ్రూప్ కట్టారు. హైకమాండ్ కి ఫిర్యాదుల దాకా వెళ్లిపోయింది. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఆయన వస్తారా రారా అనే సందిగ్ధం ఏర్పడింది. సీఎం కేసీఆర్ కి గట్టి కౌంటర్ ఇవ్వాలంటే మంచి వాగ్ధాటి ఉన్న రేవంత్ వల్లనే అవుతుందని కార్యకర్తలు అంటున్నా… ఇంతవరకూ ఆయన్ని ప్రచారానికి ఉత్తమ్ ఆహ్వానించలేదు. అయితే, ఎట్టకేలకు మనసు మార్చుకున్నట్టున్నారు. హుజూర్ నగర్లో రేవంత్ రెడ్డి ప్రచారం ఖరారైంది. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన రోడ్ షో చేయబోతున్నారు.
ఈ రోడ్ షోలో రేవంత్ ఏం మాట్లాడతారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, పద్మావతి అభ్యర్థిత్వాన్ని ఆయనే వ్యతిరేకించారు. ఇప్పుడు ఆమెకి మద్దతుగా ఆయనే మాట్లాడాల్సి వస్తోంది. దీనికి సంబంధించి ప్రజలకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక, తెరాసపై ఎలాగూ తనదైన శైలిలో పదునైన విమర్శలు ఉంటాయి. రేవంత్ కేంపెయిన్ తో కాంగ్రెస్ కి కొంత ఊపు వస్తుంది, రాష్ట్రస్థాయిలో ఆయన పర్యటన కచ్చితంగా కొంత చర్చనీయమయ్యే అవకాశం ఉంది.
ఇవన్నీ ఓకేగానీ… వాస్తవంగా హుజూర్ నగర్లో రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల పార్టీకి అదనంగా ఏదైనా మేలు జరుగుతుందా..? ఉంటుందనే కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే, అది ఉత్తమ్ సిట్టింగ్ స్థానం. స్థానికంగా ఆయన బలమైన నాయకుడు. అయితే, హుజూర్ నగర్లో టీడీపీ అభిమానులు కొంతమంది ఉన్నారు. అయితే, ఇప్పటికే చాలామంది తెరాసవైపు వెళ్లిపోయారు. ఒకప్పుడు వీళ్లంతా రేవంత్ అభిమానులు. ఈ పర్యటన ద్వారా గతంలో టీడీపీలో ఉండగా తనని అభిమానించేవారికి ఇప్పుడు కాంగ్రెస్ వైపు కొంతైనా మళ్లించగలరు అనేది ఆ పార్టీలో వినిపిస్తున్న కొత్త విశ్లేషణ. అయితే, ఇదే సమయంలో టీడీపీ కూడా కిరణ్మయిని అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ లెక్కన టీడీపీ నుంచి వెళ్లిన, తెరాసకు చెందిన కొంత ఓటు బ్యాంకు చీలుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. సరే, ఏదేమైనా… కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పర్యటన అనుకూలించే అంశమే. అయితే, రేవంత్ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి పద్మావతితోపాటు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి… వీళ్లు కూడా కలిసి వస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే, వీళ్లే కదా ఈ మధ్య రేవంత్ ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చింది..!