తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు కేసీఆర్ 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. వారు అడిగిన సౌకర్యాలు కల్పించారు. తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవడానికి బలమైన కారణాల్లో ఒకటి సకలజనుల సమ్మె. దీన్ని సక్సెస్ చేయడంలో.. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఉంది. అందుకే కేసీఆర్.. కొత్త రాష్ట్రంలో తొలి ఐదేళ్లలో ఉద్యోగుల్ని కష్టపెట్టలేదు. వారు కోరిన సౌకర్యాలు కల్పించారు. కానీ… రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు.. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వారి డిమాండ్లను కనీసం పరిశీలించడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.
ఉద్యోగులు లంచగొండులుగా తెలంగాణ సర్కార్ ప్రచారం..!
ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుని ప్రజలను పీడిస్తున్నారన్న అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేశారు. దానికి ఉదాహరణకు రెవిన్యూ శాఖను పేర్కొని.. ఆ శాఖను రద్దు చేయాలన్నంత ఆలోచన చేశారు. విద్యుత్ ఉద్యోగులు కూడా.. ప్రజలు ఎలాంటి సేవలు చేయాల్సి వచ్చినా… వేలు, లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. ఐదేళ్ల క్రితం… 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినప్పుడే కేసీఆర్.. అడిగినంత జీతం పెంచామని.. ఇక లంచాలకు దూరంగా ఉండాలని ఉద్యోగులను కోరారు. అయితే ఉద్యోగులు తన మాట లెక్క చేయలేదని.. కేసీఆర్ ఐదేళ్ల తర్వాత రియలైజ్ అయ్యారని… ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న చర్యలతో స్పష్టమవుతోందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా 44శాతం ఫిట్ మెంట్ను కేసీఆర్ ఇచ్చారు. అయితే ఐదేళ్లు తిరిగే సరికి ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయమని డిమాండ్ చేస్తూండటం కూడా.. కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ఇక విధుల్లోకి తీసుకోకూడదన్న లక్ష్యంతోనే కేసీఆర్ అడుగులు ముందుకేస్తున్నారు.)
ఉద్యోగులను ఏమీ చేయకపోతున్నా పోరాడే నేతలెక్కడున్నారు..?
అయితే ఉద్యోగులు మాత్రం…తెలంగాణ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో జీతాలు, జీవితాలు పణంగా పెట్టినా.. సమైక్య రాష్ట్రంలోలాగే తమ పరిస్థితి ఉందని అంటున్నాయి. ఉద్యమం సందర్భంగా.. కేసీఆర్ ఇచ్చిన హామీలేమీ నెరవేరలేదని అంటున్నారు. పైగా… తాము గొంతెమ్మ కోరికలు కోరుతున్నామని, లంచాలు తీసుకుంటున్నామన్నట్లుగా ప్రచారం చేస్తూ.. ప్రజలను తమపై రెచ్చగొడుతున్నారన్న ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికి ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. ఇలా ప్రభుత్వం ఏం చేసినా పట్టకుండా ఉంటే.. తర్వాత తమ పరిస్థితి అలానే ఉంటుందన్న అభిప్రాయం ఇతర ఉద్యోగ సంఘాల్లోనూ వ్యక్తమవుతోంది. కానీ వారి నాయకత్వం కేసీఆర్ గుప్పిట్లో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు బలంగా ఉండేవి.
ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతివ్వలేని పరిస్థితి ఇతర సంఘాలకు ఎందుకొచ్చింది..?
ఉద్యమ వేడితో.. అప్పుడు ఉన్న నాయకత్వాన్ని ఉద్యోగులందరూ బలపరిచారు. ఆ ఉద్యోగ సంఘ నాయకులు… చివరికి టీఆర్ఎస్ నేతలైపోయారు. స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు పదవులు అలంకరించారు. తర్వాతి నాయకత్వం కూడా… రాజకీయాల్లోకి వచ్చింది. దాంతో.. ఉద్యోగులకు బలమైన నాయకత్వం కరవైపోయింది. ఇప్పుడు.. వారి తరపున ప్రభుత్వంపై గట్టిగా పోరాడే నేత కనిపించడం లేదు. ఆర్టీసీ సమ్మె విషయాన్ని అటు ప్రభుత్వం.. ఇటు కార్మికులు తమ పట్టు విడవకుండా.. కొనసాగిస్తే అది మిగతా ఉద్యోగుల్లోనూ అలజడి రేపడం ఖాయమే. అలా జరిగితే… ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులన్నట్లుగా పరిస్థితి మారిపోతోంది. అయితే.. ఈ విషయంలో ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందడం లేదు. తమకు ప్రజల మద్దతు ఉంటుందని అంటున్నారు. ఉద్యోగుల మధ్య అనైక్యతే కేసీఆర్కు వరం.