ఎన్నికలు అయిపోయి ఆరు నెలలయింది.. ఎన్నికల ఫలితాలొచ్చి నాలుగు నెలలు దాటిపోయింది. పాతికేళ్ల రాజకీయం కోసం వచ్చానంటూ… జనసేన పెట్టిన జనసేన జాడ మాత్రం కనిపించడం లేదు. సినిమా ఇండస్ట్ర్రీ స్టైల్లో అప్పుడప్పుడు ప్రోగ్రామ్‌లు.. లేకపోతే.. సినిమా అప్ డేట్స్ చెబుతూ.. రిలీజయ్యేలా.. ప్రెస్నోట్లు మాత్రమే.. విడుదలవుతున్నాయి. ఇక జనసేనాధినేత ఫ్యాన్స్ మాత్రం రీ ట్వీట్లు చేసి.. తాము చేసేదే రాజకీయమని కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఇలా అయితే.. జనసేన పార్టీ ఐటమ్‌గానే మిగిలిపోయే ప్రమాదం కచ్చితంగా ఉందని.. నిఖార్సైన జనసైనికుల ఆవేదన..!
పవన్ “అన్ ఫిట్” అయిపోయారా..?
ఓటమని తనను ఏ మాత్రం కుంగదీయలేదని పవన్ కల్యాణ్ పైకి చెబుతున్నారు కానీ… రాజకీయ కార్యాచరణలో మాత్రం.. ఆ స్ఫూర్తిని చూపించలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడానికి తన పార్టీకి వచ్చిన ఆరు శాతం ఓట్లు చాలంటూ… గంభీరంగా ప్రకటించిన పవన్.., గత నాలుగు నెలల కాలంలో… ఆ దిశగా ప్రయత్నమే చేయలేదు. ఏపీ సర్కార్.. నాలుగు నెలల పాలనలో… ప్రతీ వర్గం ఇబ్బంది పడుతోంది. ఇసుక బ్లాక్ మార్కెటిగ్ కారణంగా.. లక్షలాది మంది కూలీల కడుపుకొట్టినట్లయింది. ప్రతీ రంగంలోనూ.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ చేసిన పోరాటమంతా.. ప్రెస్‌నోట్లలోనే ఉంది. భవన నిర్మాణ కూలీల కోసం ప్రెస్ నోటే… వంద రోజుల పాలనపై ప్రెస్‌మీటే… ఏపీలో అంతకంతకూ మారిపోతున్న రాజకీయాలపైనా.. స్పందించేది.. ప్రెస్ నోట్ల ద్వారానే…!. పవన్ కల్యాణ్ గతంలో కన్ను సర్జరీ అన్నారు.. ఆ తర్వాత కాళ్ల వాపన్నారు.. ఇప్పుడు నడుం నొప్పంటున్నారు… ! పవన్ కల్యాణ్.. రకరకాల కారణాలు చెబుతూ ఉండవచ్చు కానీ… రాజకీయాల్లో ఈ “అన్‌ఫిట్” ఆబ్సెన్సీ లేకుండా చూసుకున్నప్పుడే.. ప్రజల్లో ఉన్నట్లుగా ఎవరైనా భావిస్తారు. లేకపోతే పార్ట్ టైమ్ అనే ముద్ర బలపండే ప్రమాదం ఉంది.
జనసేనను ఫిట్‌గా ఉంచడానికి వ్యక్తిగత ఫిట్నెస్ అవసరం లేదుగా..!?
పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఫిట్‌నెస్‌కు కాస్త ఇబ్బంది ఎదురయి ఉండవచ్చు. కానీ జనసేన ఫిట్‌నెస్‌పై మాత్రం.. ఆ ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్ పై ఉంది. తాను కదిలినప్పుడే.. జనసేన కదలాలన్నట్లుగా.. లేకపోతే.. తనలాగే నిద్రాణంగా ఉండాలన్నట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్.. జనసేన అనే ఓ వ్యవస్థను తయారు చేశారు. దాని పని దాన్ని చేసే విధంగా కార్యాచరణ మాత్రం ఖరారు చేయలేదు. దాంతోనే.. అసలు సమస్య వస్తోంది. అంతా తాను చెప్పినట్లే చేయాలనుకోవడం కరెక్టే కానీ.. అసలు తానేమీ చెప్పకుండా ఉండటం కరెక్ట్ కాదు. అలాగనీ.. ప్రతీ విషయాన్ని పవన్ కల్యాణ్ చూసుకోవడం కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తించి.. జనసేన వ్యవస్థను పవన్ కల్యాణ్ పని చేసేలా చూసుకుని.. తాను మానిటరింగ్ చేస్తే… జనసేన పూర్తి ఫిట్నెస్తో ప్రజల్లోకి పరుగులు తీసే అవకాశం ఉంటుంది.
నేతలు వెళ్లిపోవడానికి ఈ నిర్లిప్తతే కదా కారణం..!?
జనసేన పార్టీని ఇటీవలి కాలంలో ముఖ్యనేతలందరూ విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. కొంత మంది బీజేపీలో చేరిపోతున్నారు. మరికొంత మంది వైసీపీలో చేరిపోతున్నారు. వారంతా.. జనసేన పెట్టినప్పటి నుండి ఉన్నవాళ్లే. కొంత మంది మధ్యలో వచ్చినా.. మధ్యలోనే వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోవడానికి వారు పెద్ద కారణాలు చెప్పడం లేదు. వారి కంప్లైంట్ ఒక్కటే… పార్టీ కార్యక్రమాలు జరగడం లేదని. ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి. ఏదో ఓ కార్యాచరణ రెడీ చేసుకోవాలి. భారీ ఓటమిని ఎదుర్కొన్నా.. టీడీపీ ఆ ప్రభావం తనపై పడనీయలేదు. రోజూ.. యాక్టివ్‌గా ఏదో ఓ కార్యక్రమం పెట్టుకుంటోంది. కానీ జనసేనలో..మాత్రం అంతా సైలెన్స్. ఉన్న కొద్ది మందిలోనే అంతర్గత రాజకీయాలు. దానికి తోడు.. ఎవరు ఏ పనీ చేయకూడదు. ఈ కారణాలతోనే… నేతలంతా వెళ్లిపోతున్నారు. దీన్ని పవన్ గుర్తించలేదు.. గుర్తించినా.. గుర్తించనట్లుగానే ఉంటున్నారు.
సేనాని మారాలి.. సేనలు యుద్ధ రంగంలోకి వెళ్లాలి…!
జనసేనాని ఇప్పటికైనా.. స్మార్ట్ గా రాజకీయంగా చేయడం నేర్చుకోవాలన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. తాను రోడ్డు మీదకు వస్తేనే రాజకీయం .. లేకపోతే లేదన్నట్లుగా ఉన్న పరిస్థితిని మార్చి.. తాను అరుదుగా తెరపైకి వచ్చినా.. తన తరపున జనసేన రాజకీయం చేయగలగాలి. సోషల్ మీడియాలో.. ట్వీట్టర్లో శ్రమిస్తున్న జనసైనికుల్ని.. రాజకీయ యుద్ధంలో… క్షేత్ర స్థాయిలో పోరాడేవారిగా మార్పు చేసుకోవాలి. అప్పుడే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే.. జనసేన ప్రెస్ నోట్లు, ట్వీట్ల పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.