అవును ! గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస అనూహ్యమైన విజయాన్ని దక్కించుకోవడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన, ఆ పార్టీలో మిగిలి ఉన్న నగర ఎమ్మెల్యేల రేటు ఒక్కసారిగా ‘డ్రాప్’ అయిపోయింది. తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఆ పార్టీలోనే ఉన్నందుకు ఇప్పుడు వారి విలువ ఒక్కసారిగా ‘సున్నాగా’ మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లూ అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీల నుంచి సిటింగు ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని తెరాస లో చేరేలా ప్రోత్సహించడానికి తెరాస బాస్‌లు చాలా పెద్దపెద్ద ఆఫర్లు చూపుతూ వచ్చారు. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమ బలం పెంచుకోవడానికి వీరు ఉపయోగపడతారనే ఆలోచన పార్టీకి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. గ్రేటర్లో తమకు ఎంత బలం ఉన్నదో తెరాసకు స్పష్టత వచ్చేసింది. అందుకే తెదేపానుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు తమవైపు రావాలనుకున్నా కూడా ఎగబడి ఆహ్వానించేంత పరిస్థితి లేకుండా పోయింది.
గతంలో అయితే తెలుగుదేశం ఎమ్మెల్యేలకు తెరాస నేతలు భారీ ఆఫర్లే ప్రకటించి తెరాసలో చేర్చుకున్నారు. తొలివిడతలో గులాబీ తాయిలాలను స్వీకరించిన వారిలో తలసాని శ్రీనివాసయాదవ్‌కు మంత్రి పదవి దక్కితే.. తీగల కృష్ణారెడ్డికి ఇతరత్రా ప్రయోజనాలు దక్కాయని అంటుంటారు. అదే క్రమంలో వ్యాపారాలు, ఇతర అంశాలు, ప్రయోజనాలు చూసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కారణాల మీద గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి అవసరాలు లేని వారికి భారీగా నగదు ఆఫర్లను కూడా గతంలో తెరాస ప్రకటించింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు దానికి లొంగలేదు. కేవలం డబ్బు కోసం పార్టీ మారితే.. ముందు ముందు అదే పార్టీలో చిన్నచూపు చూస్తారేమో అనే భయం కూడా వారిని వెన్నాడింది.
ఏదేమైనా గ్రేటర్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు కూడా తెదేపా ఎమ్మెల్యేలు కొందరికి భారీ ఆఫర్లే ఉన్నాయి. కూకట్పల్లి మాదిరిగానే ఆ ప్రాంతంలోని ఒక తెదేపా ఎమ్మెల్యేకు భారీగా క్యాష్ ఆఫర్‌తోనే పార్టీలోకి ఆహ్వానించినట్లు పుకార్లు వచ్చాయి. ఆయన గ్రేటర్ ఎన్నికల తర్వాత.. వచ్చి చేరుతానని చెప్పారుట. ఇలాంటివి మరికొన్ని దృష్టాంతాలు ఉన్నాయి.
అయితే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఈ రేంజిలో వచ్చిన తర్వాత.. సదరు తెదేపా ఎమ్మెల్యేలకు తెరాస ఆఫర్ చేయగల రేటు దారుణంగా పడిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్యేలు కాదు కదా.. ఏ పార్టీ వారు తెరాసలోకి వచ్చినా.. ప్రత్యేకంగా వారికి తాయిలాలు ఏమీ దక్కవని.. వారే తమ భవిష్యత్తు కోసం వచ్చి చేరాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాపం.. కేవలం కొన్ని వారాలు, నెలల వ్యవధిలో కోట్లలో ఉన్న ఆఫర్లు సున్నాకు పడిపోవడం అనేది సదరు తెదేపా ఎమ్మెల్యేలకు కళ్లమ్మట నీళ్లు తెప్పిస్తుండవచ్చు. ఆరోజే పార్టీ వీడిపోనందుకు ఇప్పుడు వారు పశ్చాత్తాపపడుతూ ఉండవచ్చు.