టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. రవిప్రకాష్‌ను కస్టడీకి తీసుకుని ఎలాంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కోర్టుకు స్పష్టత ఇవ్వడంలో పోలీసులు విఫలమయ్యారు. వరుసగా కొన్ని రోజుల పాటు వివరాలు సమర్పించేందుకు వాయిదాలు కోరిన పోలీసులు ..చివరికి సమర్థవంతమైన వాదన వినిపించలేకపోయారు. ఈ కారణంగా న్యాయమూర్తి ..రవిప్రకాష్ కస్టడీ పిటిషన్‌ను కొట్టేశారు. సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాష్.. ఏబీసీఎల్ కంపెనీ నుంచి అక్రమంగా బోనస్ డ్రా చేసుకున్నారంటూ.. అలంద మీడియా సంస్థ తరపున సింగారావు ఫిర్యాదు చేశారు.
దీంతో ఐదో తేదీన రవిప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా… పండగ ముందుగా అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలో… బోనస్ రూపంలో.. రవిప్రకాష్ తో పాటు ఇతరులు తీసుకున్న రూ. 18 కోట్లు ఎటు వెళ్లాయో తెలుసుకుంటామంటూ పోలీసులు కస్టడి పిటిషన్ వేశారు. దీనిపై వాదనల్లో రవిప్రకాష్ తరపు న్యాయవాదులు… ఉద్యోగులు అందరికీ వచ్చినట్లుగానే బోనస్ వచ్చిందని ఆధారాలు చూపించారు. అదే సమయంలో ఈ వివాదం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఉందని… న్యాయమూర్తికి వివరించారు.
ఈ క్రమంలో.. న్యాయమూర్తి నిర్ణయం పోలీసులకు షాక్ ఇచ్చినట్లయింది. సాధారణంగా… ఏదైనా కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసి.. కస్టడీ అడిగితే.. కోర్టులు ఇస్తాయి. అసాధారణంగా… ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినట్లయితేనే… కస్టడీని తిరస్కరిస్తారు. రవిప్రకాష్ విషయంలో బంజారాహిల్స్ పోలీసులు కనీస ఆధారాలు కూడా చూపించలేకపోయారని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.