రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం రెండు రోజుల కిందట ప్రకటించింది. దీని ప్రకారం…ప్రభుత్వం గుర్తించిన లబ్దిదారులందరికీ.. నగదులు ఈ రోజు బ్యాంకు ఖాతాల్లో పడిపోవాలి. రేపటి నుంచి ఖాతాల్లో వేస్తామని.. సీఎం నెల్లూరులో ప్రకటించారు. అంతే కాదు.. రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ఆయన రైతులకు.. ఓ భారీ చెక్కు నమూనాను అందించారు. అందులో ప్రభుత్వం విడుదల చేసిన రూ. 5,510 కోట్లు లేవు. కేవలం రూ. 3785 కోట్లు మాత్రమే చూపిస్తున్నాయి. అంటే.. దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వరకూ రెండు రోజుల వ్యవధిలోనే లోటు పడిపోయింది. ఆర్థిక శాఖ అంత మొత్తం విడుదల చేసేసిన తర్వాతా ఎందుకు .. తగ్గిపోయాయన్నది అధికారవర్గాలకు మాత్రమే తెలిసిన విషయం.
నిజానికి ఆర్థిక శాఖ రైతు భరోసాకు రూ. 5,510 కోట్లు విడుదల ఉత్తర్వులు జారీ చేసే సమయానికి ప్రభుత్వం… మూడు విడతలుగా.. పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన చేయలేదు. కానీ..రూ. 5,510 కోట్లు విడుదల ఉత్తర్వులిచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద తగినంత నగదు లేదనే విషయం తెలిసింది. వెంటనే.. రైతు ప్రతినిధుల పేరుతో వైసీపీ నేతల్ని పిలిపించి.. వారే మూడు విడతలుగా ఇవ్వాలని కోరినట్లుగా ప్రచారం చేసి.. భరోసాను మూడు ముక్కలుగా చేశారు. దాంతో.. ఇచ్చే మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం రూ. 3785 కోట్లు అవుతుంది. అందుకే.. అంత మొత్తం అంకే వెసి.. జగన్ రైతులకు చెక్కులిస్తున్నట్లుగా ఫోటోలు దిగారు.
రైతు భరోసా కార్యక్రమం… అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ చేశారు. లబ్దిదారులకు చెక్కులిచ్చారు. కానీ ఆ చెక్కులన్నీ డమ్మీ చెక్కులే. అందులో.. రూ. 7500 ఇస్తున్నట్లుగా ప్రింట్ చేశారు. కానీ… అవి బ్యాంకులో వేయడానికి ఉపయోగపడవు రైతుల ఖాతాలకు నేరుగా ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఎప్పుడు చేస్తారనేది అధికారవర్గాలకు అంతుచిక్కని విషయం. వివిధ రూపాల్లో నిధుల సమీకరణను ప్రభుత్వం చేస్తోంది. ఎంత అందుబాటులోకి వస్తే అంత.. అప్పటికప్పుడు బదిలీ చేస్తారు. అంటే.. ఈ బదిలీ నెలాఖరు వరకూ జరగొచ్చని అంచున్నారు. భరోసాకు వాయిదాలే కాదు.. నిరీక్షణ కూడా తప్పదంటున్నారు.