దీపావళి సీజన్లో తెలుగు సినిమాలకు పెద్దగా స్కోప్ ఉండదు. దీపావళి రిలీజ్ కలిసొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే దీపావళికి టాలీవుడ్ పెద్దగా పట్టించుకోదు. అయితే తమిళం నుంచి మాత్రం విరివిగా సినిమాలొస్తాయి. తమిళనాట దీపావళి మంచి సీజన్. అగ్ర హీరోలు అక్కడ దీపావళికి తమ సినిమాల్ని రిలీజ్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈసారి కూడా తమిళ సినిమాల హడావుడి బాగానే ఉంది. అవే తెలుగునాట కూడా విడుదల అవుతున్నాయి. అంటే ఈసారి దీపావళికి కూడా డబ్బింగ్ సినిమాలే దిక్కన్నమాట.
కార్తి కొత్త సినిమా `ఖైదీ` ఈ దీపావళికి విడుదల కానుంది. వరుస ఫ్లాపులతో కార్తి కెరియర్ బాగా డల్ అయిపోయింది. ఇప్పుడు హిట్టు కొట్టకపోతే… తన ఇమేజ్‌కి మరింత డామేజీ జరుగుతుంది. అందుకే ఖైది విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తనకు అచ్చొచ్చిన రియలిస్టిక్ కథనే ఎంచుకున్నాడు. ట్రైలర్ కూడా బాగానే కట్ చేశారు. దానికి మంచి స్పందన వస్తోంది. మరోవైపు దీపావళి రోజున విజయ్ `విజిల్` కొట్టబోతున్నాడు. అట్లీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కూడా తెలుగులో విడుదల కానుంది. ఈ దీపావళికి కార్తి, విజయ్‌ల మధ్యే పోటీ నెలకుంది. విజయ్‌తో పోలిస్తే కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కాకపోతే… ఖైది ఊర మాస్ సినిమా. విజిల్‌కి అటు బీ,సీ సెంటర్లలోనూ, ఇటు మల్టీప్లెక్స్‌లోనూ క్రేజ్ ఏర్పడొచ్చు.