వైఎఎస్ జగన్ మొదటి ఎన్నికల హామీ వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ హామీ అమలులో జగన్ మాట తప్పారు.పెట్టుబడి సాయం అందుతుందని రైతులందరూ… ఎదురు చూస్తున్న వేళ… ఎంతో హడావుడి చేసి.. ఒకే సారి రూ. 12500 ఇస్తానని చెప్పి.. రూ. 7500కి పరిమితమయ్యారు. తమ మొదటి ఎన్నికల హామీ అమలు కి జగన్మోహన్ రెడ్డి చాలా వేషాలు వేశారు.. పార్టీ నేతలతో వేయించారు. కానీ రైతులందరి నుంచి మూడు ప్రధానమైన ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి.
పీఎం కిసాన్ లేనప్పుడే రైతుభరోసా ప్రకటన..! రూ.12500 ఎందుకివ్వరు..?
జగన్మోహన్ రెడ్డి 2015లో రైతు భరోసా యాత్ర చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఆయన రంగంలోకి దిగారు. రైతులు కష్టాల్లో ఉన్నారని వారందర్నీ ఆదుకుంటానని.. ఆయన భరోసా యాత్ర చేశారు. ఈ యాత్రలో ఆయన ప్రకటించిన పథకం.. రైతు భరోసా పథకం. దీని ద్వారా ప్రతీ రైతుకు మే నెలలో పెట్టుబడి సాయం కింద రూ. 12500 ఇస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఈ హామీని.. 2017 ప్లీనరీలో అధికారికం చేశారు. నవరత్నాల పేరుతో ఈ పథకాన్ని ప్లీనరీలో ప్రకటించారు. 2015లో కానీ.. 2017లో కానీ… పీఎం కిసాన్ పథకం లేదు. ఆ పథకం కింద రైతులకు రూ. ఆరు వేలు అందడం లేదు. అప్పటికీ.. కేంద్రానికి అలాంటి ఆలోచన కూడా లేదు. ఆ సమయంలోనే జగన్ ప్రతీ రైతుకు రూ. 12500 ఇస్తానని చెప్పారు. అంటే.. రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఇస్తుందని అర్థం. కానీ అధికారంలోకి వచ్చాక.. కేంద్రం రూ. ఆరు వేలు ఇస్తుంది కాబట్టి తాను రూ. ఆరు వేలు ఐదు వందలు మాత్రమే ఇస్తానని మాట మార్చారు. మాట మీద నిలబడే రాజకీయ నాయకుడైతే.. వెనక్కి తగ్గకుండా రూ. 12500 ఇవ్వాలి. కేంద్ర పథకంతో కలిపితే… మొత్తం రూ. 18500 ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ వెయ్యి పెంచి రూ. 13500 మాత్రమే ఇస్తామంటున్నారు. అంటే జగన్ మాట మార్చారు. మడమ తిప్పారు.
లబ్దిదారులైన రైతుల సంఖ్య లక్షల్లో ఎందుకు తగ్గిపోయింది..?
ప్లీనరీలోనే జగన్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించినప్పుడు ఏపీ ప్రభుత్వ అధికారిక సోషియో ఎకనామిక్ సర్వేను ప్రస్తావించారు. ఇందులో రైతులుగా గుర్తింపబడిన వారు… 70 లక్షల మంది వరకూ ఉన్నారని… వారందరికీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రైతు భరోసాను అమలు చేస్తామని ప్రకటించారు. తీరా అమలు సమయానికి వచ్చే సరికి రూ. 40 లక్షల మంది రైతులే లబ్దిదారుల జాబితాలో చేరారు. మరో పది లక్షల మంది చేరుస్తామని చెబుతున్నారు. ఇందులో అర్హత పొందిన కౌలు రైతులు కేవలం ఇరవై శాతం మాత్రమే. ఇప్పటి వరకూ అర్హులుగా తేలిన వారు లక్ష మందిలోపే ఉన్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. మరో పది లక్షలకుపైగానే కౌలు రైతులు ఉన్నారు. ఆ పత్రాలు..ఈ పత్రాలు పేరుతో.. వారిని ఎందుకు అనర్హుల్ని చేశారో ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. భూరికార్డు సక్రమంగా లేకపోవడం వల్ల కొన్ని లక్షల మంది పేద రైతులు అనర్హులయ్యారు. వారి విషయంలో ప్రత్యేకమైన కసరత్తు చేయకుండానే అనర్హుల్ని చేసేశారు. అంతే కాదు.. కులం పేరుతో.. కౌలు రైతుల్ని విభజించారు. కౌలు రైతులకు కులం చూస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల కౌలు రైతులకు మాత్రమే… రైతు భరోసా ఇస్తామంటున్నారు. రైతు అయితే చాలు అసలు ఏమీ చూడం… అన్న మాట ఎందుకు తప్పాల్సి వచ్చింది..?
ఒకే సారి ఇస్తామని బల్లగుద్ది చెప్పి ఇప్పుడు మాటెందుకు తప్పారు..?
రైతు భరోసా గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో.. హైపిచ్లో వినిపించే మాట… రైతుకు పెట్టుబడి సాయం కింద.. ప్రతీ మే నెలలో రూ. 12500 ఒకే సారి ఇస్తామనే మాట. దానికి కారణం కూడా ఆయన హైపిచ్లో చెప్పేవారు. రైతుల కష్టాలు ఏకరవు పెట్టి… వారి పెట్టుబడికి సాయమని చెప్పేవారు. ఒకే సారి ఇస్తేనే రైతుకు ప్రయోజనం అనేవారు. అలాంటి మాటలు చెప్పిన సీఎం… ఇప్పుడు.. దాన్ని మూడు వితలుగా చేసేశారు. అలా చేయడం వల్ల రైతులు ఇప్పుడు మళ్లీ ప్రైవేటు అప్పుల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకే సారి రూ. 12500 అందితే.. పెట్టుబడికి ఉపయోగపడేది.. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. ఈ వి,యంలో జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు. రైతుల రత్నాన్ని ముక్కలు చేశారు.
చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తున్నాను. చెప్పింది చెప్పినట్లుగా మేనిఫెస్టోను అమలు చేయకపోతే రాజీనామా చేసి ఇంటికెళ్లిపోయేలా వ్యవస్థను మారుస్తా అని.. జగన్మోహన్ రెడ్డి ప్రతీ సభలోనూ చెప్పారు. నిజంగా ఆయనకు చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటే.. చిత్తశుద్ధి ఆయనకు ఉంటే.. ఆయన ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. తనదైన ముద్ర వేసే అవకాశం ఆయనకు వచ్చింది.