తెలంగాణలో భాజపా విస్తరణకు విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా గొంతెత్తేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర నేతలు సిద్ధంగా ఉన్నారు. సరైన సమయం వస్తే.. పార్టీకి బాగా కలిసొచ్చేలా స్పందించేందుకు గట్టిగా జాతీయ నాయకత్వం కూడా వేచి చూస్తోందనడంలో సందేహం లేదు. భాజపా విస్తరణ పనుల మీద ఎలాగైతే ప్రత్యేక దృష్టి పెడుతోందో… ఇదో సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మీద, ఇటీవల వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా కేంద్రం కన్నేసి ఉంచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే విషయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరుని కేంద్రం గమనిస్తోందని లక్ష్మణ్ మీడియాతో చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారనీ, దీని మీదే కేంద్రంలో చర్చ జరుగుతోందని ఆయన చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతోపాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అన్ని పరిణామాలపై కేంద్రం ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తోందన్నారు. కేసీఆర్ తీరుతో విసిగిపోయిన పసుపు రైతులు నిజామాబాద్ లో ఎలాగైతే సీఎం కుమార్తె కవితను ఓడించారో… అదే తరహాలో సీఎం అహంకారంపై హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ఓడించి, భాజపాని గెలిపిస్తారని లక్ష్మణ్ చెప్పారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రం నిధులతో హుజూర్ నగర్ ను అభివృద్ధి చేస్తామన్నారు.
కేసీఆర్ తీరుపై కేంద్రం కన్నేసి ఉంచిన మాట వాస్తవమే అయినా… దాన్ని భాజపాకి అనుకూలంగా ప్రయోగించే సమయమూ సందర్భమూ ఇంకా భాజపాకి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ మొండి వైఖరితో ఉన్నారు. అయితే, ఈ వైఖరి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచిందా లేదా అనేది వ్యక్తమయ్యే సందర్భం ఇంకా రాలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో దాని ప్రభావం కొంత మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అయితే, అక్కడ భాజపాకి అనుకూలమైన ఫలితం వచ్చే అవకాశం తక్కువ. నిజామాబాద్ ఫలితం హుజూర్ నగర్లో రిపీట్ కావడానికి… అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి సమస్యలు వేరు. అక్కడ కేసీఆర్ కుమార్తెను ఓడించాలన్న కోపంతో రైతులు తిరగబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. పోనీ, నిజమాబాద్ లో డి. అరవింద్ లాంటి గట్టి నాయకులు హుజూర్ నగర్లో లేరు. కాబట్టి, హుజూర్ నగర్ ఉప ఎన్నికకీ… నిజామాబాద్ లోక సభ స్థానానికి జరిగిన ఎన్నికకీ పోలిక ఎలా కుదురుతుంది..?