ఎన్నికల పర్వం 90 శాతం ముగిసినట్టే. ఇక కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఘట్టం మిగిలి ఉంది. ఈనెల 11వ తేదీన ఈ ఎన్నిక కూడా జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారు? లేదా, ఆ అధికారాన్ని కూడా కేటీఆర్‌కే వదిలేస్తారా? అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
సహజంగానే మేయర్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎక్కువగానే ఉంది. వ్యక్తుల వారీగా చూస్తే ఈ జాబితా చాలా పెద్దదిగానే అవుతుంది. ఎవరికి వారు తెరాసతో తమకున్న పురాతన అనుబంధాన్ని, తమ తమ కుటుంబాలకు రాజకీయాల్లో ఉన్న అనుభవాన్ని, గ్రేటర్ పరిధిలో తమకు ఉన్న అనుభవాన్ని ఇలా రకరకాల అర్హతల్ని చాటుకుంటూ.. వారు తమనే మేయర్ చేయాలంటూ పార్టీ నాయకత్వానికి విన్నవించుకుంటున్నారు.
అయితే ఈ రెండు స్థానాలకు సమర్థులను ఎంపిక చేయడంలో పార్టీ ఒక వ్యూహం ప్రకారం వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీని ఎంతో కాలం నుంచి నమ్ముకుని విధేయులుగా కష్టపడి పనిచేస్తూ ఉన్న వారికి మేయర్ పీఠం కట్టబెట్టాలని, అలాగే ఈ ఎన్నికల్లో ప్రాంతాల వైషమ్యాల ఊసు కూడా లేకుండా తెరాసకు భారీ విజయం దక్కడానికి కీలకంగా ఓట్లు వేసిన సహకరించిన సీమాంధ్రుల ప్రతినిధుల్లో ఒకరిని డిప్యూటీ మేయర్‌ను చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలనుంచి సమాచారం అందుతున్నది.
సీమాంధ్రుల విషయంలో కేసీఆర్ వైఖరి మారుతున్నదనే సంకేతాలను మరింత స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ద్వారా సాధ్యమవుతుందని వారు నమ్ముతున్నారు. సీమాంధ్రులంతా కూడా మా బిడ్డలే అనే నినాదాన్ని మెచ్చి వారంతా ఓట్లు వేస్తేనే.. తెరాసకు ఇంత భారీ విజయం దక్కింది. అయితే సీమాంధ్రుల్లో అభిమానాన్ని పదిలంగా కాపాడుకోవడానికి వారి వర్గంనుంచి ఎన్నికైన కార్పొరేటర్లలో ఒకరికి డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలని నిర్ణయించినట్లుగా అనుకుంటున్నారు. అలాగే ఈ రెండు స్థానాల్లో ఒక్కటైనా మహిళకు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ విషయమై పార్టీ ప్రకటన కూడా చేయవచ్చునని భావిస్తున్నారు.