మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో తవ్వేకొద్దీ ఐటీ అధికారులు సంపద బయట పడుతున్నట్లుగా ఉంది. అందుకే వారం రోజులు గడిచినా.. ఇంకా ఇంకా సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరో రెండు రోజుల పాటు సోదాలు ఉంటాయని చెబుతున్నారు. వరుసగా మూడు రోజుల పాటు జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు అంతర్గత పరిశీలన జరిపారు. ఆ తర్వాత నుంచి సీజ్ చేయడం ప్రారంభించారు. మేఘా ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న సోదాల్లో లభిస్తున్న ఆధారాలతో… అప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో.. బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు. ఆయా బ్యాంకుల్లో ఉండే లాకర్లలో ఉన్న డాక్యుమెంట్లు, బంగారు, నగదును స్వాధీనం చేసుకుని తీసుకొస్తున్నారు. రెండు రోజులుగా.. సీజ్ చేస్తున్న పత్రాలు, నగదును ప్రత్యేకమైన బాక్సుల్లో పెట్టి… సీల్ వేసి మరీ తీసుకెళ్తున్నారు. ఈ దృశ్యాలు మీడియా కంట బడ్డాయి.
బాలానగర్‌లోని మేఘా ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ బ్రాంచిలో ఉన్న లాకర్ నుంచి రెండున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. జూబ్లిహిల్స్, మాదాపూర్ కావూరి హిల్స్ బ్యాంకుల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. సీజ్ చేసిన డాక్యుమెంట్లు ఉన్న బాక్సులపై మేఘా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి, ఫణి రెడ్డి పేర్లను.. ఐటీ అధికారులు రాశారు. అంటే.. అందులో ఉన్న సొత్తు అంతా వారికి సంబంధించినదని అర్థమని.. ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మేఘా కృష్ణారెడ్డితోపాటు ఆయన కంపెనీలో కీలకంగా వ్యవహరించే అధికారులు, ఆడిటర్లను… ఐటీ అధికారులు ఏ విషయమూ వదిలి పెట్టకుండా పరిశీలిస్తున్నారు.
మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, బ్యాంక్ లాకర్లలో పెద్ద ఎత్తున నగలు బయటపడినట్లుగా తెలుస్తోంది. ఇలా బయట పడిన బంగారం విలువ కొన్ని కోట్లు ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యూయలరీ దుకాణంలో.. వాటిని కొనుగోలు చేశారని.. అయితే లెక్కలు లేవని.. ప్రచారం జరుగుతోంది. ఐటీ అధికారులు లెక్కలు లేని వాటినే సీజ్ చేస్తారు. ఈ లెక్కలు.. ఐదారు బాక్సులు సీల్ వేసి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అందులో కీలకమైన ఫైల్స్ అన్నీ ఉన్నాయి. వాటిపై.. ఐటీ అధికారులు అసలు విచారణ ప్రారంభిస్తే.. చాలా మంది రాజకీయ నేతల జాతకాల గుట్టు బయటపడుతుందన్న ప్రచారం జరుగుతోంది.