ప్రకాష్‌రాజ్ మంచి నటుడు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయ ఉత్తమ నటుడిగా ఆయన అందుకున్న పురస్కారాలే చెబుతాయి. ఏ పాత్రకైనా వన్నె తీసుకురాగల సమర్థుడు ప్రకాష్‌రాజ్. కాకపోతే.. ఇప్పుడు ఆయన ముందు ఓ కొండంత సవాల్ ఉంది. అది.. నానా పటేకర్ రూపంలో.
మరాఠీలో ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్న చిత్రం ‘నట సామ్రాట్’. నానా పటేకర్ ప్రధాన పాత్రధారిగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో `రంగ మార్తాండ`గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నారు. కృష్ణవంశీ దర్శకుడు.
నాటకరంగంలో.. మహానటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఓ వ్యక్తి కథ ఇది. స్టేజీపై తప్ప, జీవితంలో నటించడం చేతకాని ఓ సామాన్యుడి కథ ఇది. బంధాల చేతిలో మోసపోయిన ఓ అభాగ్యుడి జీవితం ఇది. విధి చేతిలో వంచనకు గురైన – ఓ దురదృష్ట జాతకుడి వ్యధ ఇది. ఆ పాత్రలో నానా పటేకర్ నటన చూస్తే నిజంగానే `నట సామ్రాట్` అంటూ చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. నానా పటేకర్ ఇది వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాడు. మహానటుడు అనిపించుకున్నాడు. జాతీయ స్థాయిలో అవార్డులూ అందుకున్నాడు. అవన్నీ ఒక ఎత్తయితే…. `నట సామ్రాట్` మరో ఎత్తు. నానా నటనకు ఇది విశ్వరూప దర్శనం.
ఆ పాత్రని మోసేంత తెగువ, ధైర్యం ప్రకాష్ రాజ్ చేస్తున్నాడిప్పుడు. నిజంగా ఇది సాహసమే అనుకోవాలి. నానాని తట్టుకునే శక్తి ప్రకాష్‌రాజ్‌కి ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘నట సామ్రాట్’ మొత్తాన్ని నానా పటేకర్ ఒక్కడే తన భుజ స్కంధాలపై మోశాడు. నానా లేకపోతే నట సామ్రాట్ లేదు. అలా…. ప్రకాష్ రాజ్ కూడా ఈసినిమాని తన భుజాలపై మోయగలడా? అనేది సందేహమే. ప్రకాష్ రాజ్ మంచి నటుడే కావొచ్చు. కానీ ఎక్కడో ఓ చోట తన నటనలో కృత్రిమత్వం బయటపడిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల ప్రకాష్ రాజ్ బాగా ఇబ్బంది పడుతుంటాడు. `ఇది నటనే` అని తెలిసిపోయేలా చేస్తుంటాడు. ప్రకాష్ రాజ్ ఆ లోటు పాట్లని ఇప్పటికీ సరి చేసుకోలేకపోయాడు. నానా అలా కాదు. నటనని ఔపాశాన పోసేశాడు. అతనిలో లోపాలు వెదికినా దొరకవు. నానా పోషించిన పాత్రకు రీ ప్లేస్‌మెంట్ లేదు. దాన్ని నానా పటేకర్ మాత్రమే భర్తీ చేయగలడు. ఇలాంటి పాత్రని మళ్లీ పోషించాలంటే… ఏ కమల్‌హాసన్ వల్లో అవుతుంది. కమల్ కూడా `ఓకే` అనిపించగలడేమో గానీ, పూర్తి స్థాయిలో మరిపించలేడు. అలాంటి పాత్రకి న్యాయం చేయడం శక్తికి మించిన పనే.
కానీ కృష్ణవంశీ మొండోడు. తన చేతిలో పడితే ఎవరైనా గొప్ప నటులుగా కనిపిస్తుంటారు. ప్రకాష్ చేసిన ఉత్తమ పాత్రలు, ఉత్తమ చిత్రాలలో కృష్ణవంశీ వాటా తప్పకుండా ఉంటుంది. ఈసారి ప్రకాష్‌రాజ్‌లోని చిన్న చిన్న లోపాల్ని సవరించి, `నట సామ్రాట్`గా నిలబెట్టడానికి కృష్ణవంశీ కాస్త కష్టపడాలి. అన్నట్టు…
కృష్ణవంశీకీ దర్శకుడిగా ఇది పెద్ద పరీక్షే. ఎందుకంటే కృష్ణవంశీ ఇప్పటి వరకూ ఓ రీమేక్ కథని ఎంచుకున్నది లేదు. దానికి తగ్గటు ఫామ్ లో అస్సలు లేడు. కల్ట్ క్లాసిక్ అనిపించుకున్న కథని ఎలా తీస్తాడో అన్న సందేహాలు చాలా ఉన్నాయి. వాటిని పటాపంచలు చేయాల్సిన బాధ్యత అటు కృష్ణవంశీకి, ఇటు ప్రకాష్‌రాజ్‌కీ సమానంగా ఉంది.