తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య రెట్టింపయింది. తెలంగాణలో ఉన్న 2216 దుకాణాల కోసం 48వేల మందికిపైగా వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది వీరి సంఖ్య ఇరవై నాలుగు వేల లోపే ఉంది. షాపు కోసం దరఖాస్తు ఫీజు రూ. రెండు లక్షలు. లాటరీలో మద్యం షాపు దక్కినా.. దక్కకపోయినా .. ఈ రూ. రెండు లక్షలు మాత్రం తిరిగి ఇవ్వరు. అంటే.. ఈ 48వేల మంది దరఖాస్తుల దగ్గర నుంచి తెలంగాణ సర్కార్ కు రూ. 907 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇలా వచ్చిన ఆదాయం రూ. నాలుగు వందల కోట్లలోపే ఉంటుంది. అంటే.. ఈ సారి ఐదు వందల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.
తెలంగాణలో ఇంత భారీగా మద్యం దుకాణాలకు పోటీ పెరగడానికి కారణం.. ఏపీ నుంచి మద్యం వ్యాపారులు తెలంగాణలో షాపుల కోసం పోటీ పడటమే. ఏపీలో ప్రభుత్వం మద్యం విధానం మార్చింది. సొంతంగా అమ్మడం ప్రారంభించింది. దీంతో వ్యాపారులు.. తమ వ్యాపారాన్ని వదిలి పెట్టాల్సి వచ్చింది. కొత్త వ్యాపారాలు ఏపీలో సాగే పరిస్థితి లేదు. అందుకే.. అందరూ తెలంగాణపై దృష్టి సారించారు. అలా.. దాదాపుగా ఇరవై వేల మందికిపైగా ఏపీ నుంచి .. వచ్చి తెలంగాణలో మద్యం వ్యాపారాల కోసం దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే.. ఏపీ మద్యం వ్యాపారుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తుల రూపేణానే.. రూ. ఐదు వందల కోట్లు దక్కాయన్నమాట.
తెలంగాణ సర్కార్కు ఇది డబుల్ బోనాంజా లాంటిది. ఇప్పటికే సరిద్దు ప్రాంతాల ప్రజలు ఏపీలో మద్యం తాగడం మానేసి.. తెలంగాణ ప్రాంతానికి వచ్చి … తాగేసి వెళ్తున్నారు. ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరగడమే కాదు.. అమ్మే సమయాన్ని కూడా కుదించారు. దాంతో.. తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా కూడా.. తెలంగాణలో మద్యం దుకాణాలకు డిమాండ్ పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ధరలు పెంచి.. ప్రభుత్వమే.. మద్యం అమ్ముతూండటం వల్ల.. ఏపీ సర్కార్ కు డబుల్ ఆదాయం… వ్యాపారులు తెలంగాణకు రావడం.. వల్ల తెలంగాణకు ఆదాయం… ఇలా రెండు రాష్ట్రాలకూ లాభం వస్తోంది. కానీ.. “టాక్స్ పేయర్ల”కు మాత్రమే జేబుకు చిల్లు పడుతోంది.